హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ‘మీరు ఎన్నికల హామీని నమ్ముతున్నారా? వాటిని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారా?’ అని హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ‘అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25వేల పెన్షన్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సికింద్రాబాద్, లాలాపేట్‌కు చెందిన గొల్లపల్లి నాగరాజు సహా 9 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది కే కరుణాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
పిటిషనర్లు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, పోలీసు కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు పొందే అర్హతను కోల్పోయారని తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం జీవితాలను పణంగా పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుషర కాలం పూర్తయినా ఇప్పటికీ ఉద్యమకారులు కేసులను ఎదురొంటున్నారని, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని అన్నారు.
అందరికీ ఇవ్వడం సాధ్యమేనా?
వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల హామీని ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశా లు జారీచేయాలని కోరడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు పెన్షన్, ఇంటి జాగ ఇస్తామని 2023లో ఇచ్చిన ఎన్నికల హామీని కూడా ఇంకా నమ్ముతున్నారా? అడ్మినిస్ట్రేషన్ గురించి ఎకువ మాట్లాడదలచుకోలేదు. ఎంత సైలెంట్‌గా ఉంటే అంత బాగుంటుందని అనుకుంటున్నా ను’ అని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా పథకం అమలు కావాలంటే ప్ర భుత్వ జీవో ఉండి తీరాలని, జీవో లేకుండా ఎన్నికల హామీ అమలుచేయాలని కోరడానికి వీల్లేదని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధు లు, భూసేకరణ బాధితులు, తీవ్రవాదుల వల్ల నష్టపోయిన వాళ్లకు పెన్షన్/భూమి ఇచ్చే విషయంలో స్పష్టమైన జీవోలు ఉన్నాయని చెప్పా రు. తెలంగాణ ఉద్యమం అనేది విదేశీ పాలన కు వ్యతిరేకంగా జరిగింది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, దేశంలోనే ఉంటూ ఒక రాష్ట్రం కోసం జరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నవారికి 250 గజాల జాగ ఇవ్వాలని ఆదేశాలిస్తే, అది తేనెతుట్టెను కదిలించినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ ఉద్యమంలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పిటిషనర్ల కృషి కూడా లేదనలేము. న్యాయవాదులంతా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు హైకోర్టు గేట్లు కూడా మూసేయాల్సి వచ్చింది. జీవో లేకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి నెలకు రూ.25 వేలు చొప్పున పెన్షన్, 250 గజాల స్థలాలు కావాలంటే అమలు సాధ్యమేనా?’ అని ప్ర శ్నించారు. రాష్ట్రం ఏర్పాటై 11 ఏండ్లు అయ్యా క ఇప్పుడు పిటిషన్ వేయడం ఏమిటని అన్నా రు. ‘త్యాగం అంటే ఏమిటి? జీవితాలను త్యాగం చేయడమా? ఉదాహరణకు ట్యాంక్‌బండ్‌పై ఒక ఉద్యమం జరిగి లక్ష మంది చనిపోయారని అనుకుందాం.
ఆ లక్ష కుటుంబాలకు 250 గజాల చొప్పున జాగలు ఇవ్వా లా?’ అని ప్రశ్నించారు. పిటిషనర్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని అనడం లేదని, పిటిషనర్ల పాత్ర కీలకంగానే ఉండి ఉండవచ్చునని, అయితే తొలిదశ 1969 నుంచి మలి దశ 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి జాగలు/పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నారని పేర్కొన్నారు. 1969 నాటి ఉద్యమం అంటే బీపీఎల్ పరిధిలోని వాళ్లు ఉన్నారంటే అర్థం ఉన్నదని, తెలంగాణ వచ్చేవరకు వాళ్లు పాల్గొనడం వల్ల నష్టపోయి ఉండొచ్చని, వాళ్ల విషయంలో రెండు తరాల త్యాగం ఉన్నదని పేర్కొన్నారు. ‘ఇకడ పిటిషనర్లు అంతా యువకులే. మీలాగా ఎంతోమంది ఉన్నారు . అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలంటే ఎలా సాధ్యం?’ అని ప్రశ్నించారు. పిటిషన్లపై పోలీస్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఒక న్యాయవాది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లపై ఉన్న రెండు వేల కేసులను సవాల్ చేశారని ధర్మాసనం పేర్కొన్నది. ప్రభుత్వ వివరణ కోసం విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటిస్థలం, పింఛన్ ఇవ్వాలనే పిటిషన్‌పై వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది.