హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఏపీని నిలువరించడంలోనే కాదు.. నీటి వాటాలను తేల్చడంలోనూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పూర్తిగా చేతులెత్తేసింది. నీటి నిల్వలు పడిపోతున్న క్రమంలో పొదుపుగా వాడుకోవాలంటూ ఉచిత సలహాలను ఇవ్వడానికే పరిమితమైంది. తెలంగాణ అభ్యంతరాలను బుట్టదాఖలు చేయడమేగాక, ఏపీ వినియోగజలాల లెక్కలను తక్కువగా చూపడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మా రింది. నీటివినియోగంపై ఇరు రాష్ర్టాలు త్రీ మెంబర్ కమిటీలో తేల్చుకోవాలంటూ సన్నా యి నొక్కులు నొక్కుతున్నది.
బోర్డు తప్పుడు లెక్కలు..
ఇండెంట్లు, బోర్డు అనుమతుల్లేకుండానే ఏపీ యథేచ్ఛగా కృష్ణా జలాల మళ్లింపును కొనసాగిస్తున్నది. ఎగువన శ్రీశైలం నుంచి, దిగువన సాగర్ కుడికాలువ ద్వారా అందినకాడికి మళ్లిస్తూ వస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 200టీఎంసీలకు పైగా జలాలను పెన్నా బేసిన్‌కు ఏపీ మళ్లించింది. అవిగాకుండా మల్యాల, ముచ్చుమర్రి లిఫ్ట్‌ల ద్వారా మరో 42టీఎంసీల కృష్ణా జలాలను ఏపీ కొల్లగొట్టింది. దిగువన నాగార్జున్‌సాగర్ నుంచి కుడికాలువ, పంప్‌హౌస్ ద్వారా కూడా 140 టీఎంసీలను తరలించుకున్నది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 670 టీఎంసీలకుపైగా కృష్ణా జలాలను వినియోగించుకున్నది. నిర్దేశిత తాత్కాలిక వాటా 66శాతమే కాగా, అంతకు మించి 80శాతం మేర జలాలను మళ్లించించింది. తెలంగాణ సర్కార్ తాత్కాలిక కోటా 34శాతం జలాల నూ వినియోగించని దుస్థితి నెలకొన్నది. ఇప్పటివరకు 20శాతం జలాలను అంటే కేవలం 174టీఎంసీలను మాత్రమే మళ్లించింది. ఇంకా కోటాకు సంబంధించి 125టీఎంసీలు మిగిలే ఉన్నాయి. ఆ మేరకు యాసంగి, వేసవి తాగునీటి అవసరాలున్నాయి. శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. మరోవైపు తెలంగాణ సర్కార్ ఇప్పుడు కండ్లు తెరిచింది. ఏపీ జలదోపిడీని నివారించాలంటూ కేఆర్ఎంబీకి లేఖలు రాస్తూ వస్తున్నది. కానీ బోర్డు మాత్రం ఏపీ ఇప్పటివరకు 555టీఎంసీలనే మళ్లించిందని తేల్చడం గమనార్హం.
ఏపీకి వంతపాడుతూ..
తెలంగాణ ఫిర్యాదును ఉటంకిస్తూ బోర్డు ఏపీకి తాజాగా లేఖ రాసింది. వాస్తవంగా తెలుగు రాష్ర్టాల మధ్య నీటి వినియోగ వాటాలకు సంబంధించి ట్రిబ్యునల్ కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు నుంచి తాత్కాలిక ఒప్పందాల మేరకే కృష్ణాజలాలను ఇరు రాష్ర్టాలు వినియోగించుకుంటున్నాయి. ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ నుంచి మే31 తేదీ వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటినిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని త్రీ మెంబర్ కమిటీ నిర్ణయిస్తుంది. బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)లతో కూడిన ఈ కమిటీ ప్రతి ఏటా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. రాష్ర్టాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటినిల్వలను పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ర్టాలకు నీటివాటాలను కేటాయిస్తుంది. ఆ మేరకు ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుదల చేస్తుంది. కానీ ఈ ఏడాది యాసంగి అక్టోబర్‌లో ప్రారంభమైనా ఇంతవరకూ రివర్ బోర్డు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఏపీకి వంతపాడుతూ వస్తున్నది. మరోవైపు ఏపీ ఎలాంటి ఇండెంట్లను సమర్పించకుండా, అనుమతుల్లేకుండా నీటిని మళ్లించుకుపోతున్నా కూడా చోద్యం చూస్తూ వచ్చింది.
కాంగ్రెస్ వైఫల్యమే కారణం..
ఏపీ బరితెగింపునకు, బోర్డు వ్యవహారశైలికి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే కారణమేనని అధికారులు, రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఏపీ కోటాకు మించి నిరాటంకంగా జలాలను తరలించుకుపోతున్నదని రాష్ట్ర అధికారులు డిసెంబర్ నెల నుంచే అటు బోర్డు, ఇటు తెలంగాణ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నారు. ఏపీని అడ్డుకోవాలని ఉన్నతాధికారులు సైతం నేరుగా బోర్డు చైర్మన్‌ను ఇటీవల కలిశారు. దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. బోర్డు వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు నివేదిస్తున్నా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తూ వచ్చారు. త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయకున్నా ఇదేమిటనీ రివర్ బోర్డును కాంగ్రెస్ సర్కార్ నిలదీసింది లేదు. మరోవైపు మున్ముందు సాగర్ ఆయకట్టు కింద సాగునీటికి, వేసవిలో తాగునీటికి తండ్లాట పడే దుస్థితి ఉన్నది.