హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖ అధికారులపై ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి తరుచూ ఫైర్ అవుతున్నారట. సమావేశాలకు పిలిచి అందరి ముందే చీవాట్లు పెడుతున్నారట. కొందరు అధికారులు బదులిచ్చినా, ఎదురుచెప్పినా వారిపై రుసరుసలాడుతున్నారట. కొందరిని టార్గెట్ చేసి అసహ్యించుకుంటున్నారని.. స్వరం పెంచి సీరియస్ అవుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. కొంతకాలం క్రితమైతే ‘మిమ్మల్ని డీమోట్చేస్తా.. ఇంటికి పంపించేస్తా’ అంటూ హెచ్చరించినట్టు సమాచారం. ‘పనిని చాలా లైట్ తీసుకుంటున్నారు. సీరియస్‌గా పనిచేయడం లేదు. చనువు ఇచ్చానని నిర్లక్ష్యంగా ఉంటున్నారు’ అంటూ తాజాగా ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విద్యాశాఖలో ప్రచారం జరుగుతున్నది. బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో ఆయా ఉన్నతాధికారి సమీక్షించారు. కొందరు అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు పెంచి సమర్పించారట. ఏ ప్రతిపాదికన పెంపు కోరుతున్నారన్నది స్పష్టంచేయకపోవడంతో సదరు అధికారి తీవ్రంగా మందలించినట్టు సమాచారం. ఆర్థికశాఖ నుంచి నిధులెందుకు తెచ్చుకోలేకపోతున్నారు.. ఎక్కువ బడ్జెట్ ఎందుకు ప్రపోజ్చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారట.
మీటింగ్ అంటే వణికిపోతున్నారు..
అధికారులు ఆయా అధికారితో మీటింగ్ అంటేనే భయపడిపోతున్నారట. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో..? ఈ రోజు ఎ వరు ఎలాంటి తిట్లు తినాల్సి వస్తుందో..? అని భయపడుతున్నారట. అందరి ముందు చీవా ట్లు పెట్టడంతో కొందరు తీవ్రంగా నొచ్చుకుంటున్నారట. సన్నిహితుల వద్ద బాధను వెళ్లగక్కుతున్నారట. మరికొందరైతే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులైతే ఈ టెన్షన్‌ను తట్టుకోలేకపోతున్నామం టూ సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం. తీవ్ర జబ్బులతో బాధపడుతున్న ఉద్యోగులు సెలవుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు.. మరికొందరు బదిలీ చేయండని పైఅధికారుల ముందు మొరపెట్టుకుంటున్నట్టు తెలిసింది.