లింగాల గణపురం : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డెంగ్యూతో(Dengue) ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన లింగాల గణపురం మండలం వనపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కౌడి ఉపేందర్-అనిత దంపతుల కూతురు సంహితకు జ్వరం రాగా చికిత్స నిమిత్తం జనగామకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి టైఫాయిడ్ జ్వరమని నిర్ధారించి మందులు రాసి ఇంటికి పంపించారు.
అయితే గత మూడు రోజుల క్రితం జ్వరం తీవ్రం అవడంతో బాలికను తల్లిదండ్రులు హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు డెంగ్యూగా నిర్ధారించి మూడు రోజులుగా చికిత్సలు చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. బాలిక మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.