SLBC Tunnel | హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. మూడు మీటర్ల లోతులో రెస్క్యూ టీం మృతదేహాలను గుర్తించింది. అధునాతన పరికరాలు, రాడార్లతో మృతదేహాలను గుర్తించినట్లు రెస్క్యూ టీం తెలిపింది. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు. మృతదేహాలను సొరంగం నుంచి బయటకు తీసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.
సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్న ఏడు రోజుల తర్వాత.. చివరకు వారి మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉంటే 8 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడేవారని పలువురు నాయకులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం పట్ల రేవంత్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఓ పక్క ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం చోటు చేసుకుంటే.. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రాకపోవడంతో సహాయక చర్యల్లో ఒక్క డైరెక్షన్ సక్రమంగా లేదని విమర్శలు వెలువెత్తాయి. మంత్రులేమో పొద్దున్నే వస్తారు.. సాయంత్రానికి వెళ్తున్నారు.. ఘటన జరిగి ఇన్ని రోజులై కార్మికులు చిక్కుకున్నా.. వారిని సురక్షితంగా తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిన్న ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకున్న ప్రదేశాన్ని జిపిఆర్ఎస్ ద్వారా స్పాట్ చేసినట్టు ప్రాథమిక నివేదిక ద్వారా తెలిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు జిపిఆర్ఎస్ పరికరం ద్వారా సొరంగంలోని చివరి పాయింట్ వద్ద అత్యాధునిక పరికరాలతో స్కానింగ్ చేపట్టారు. దీంట్లో 5 స్పాట్లను ఐడెంటిఫై చేసినట్లు ఎన్జీఆర్ఐ ప్రాథమిక రిపోర్ట్‌లో వెల్లడైంది. రేడియో తరంగాల ద్వారా కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని క్షుణంగా పరిశీలించినట్లు ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సొరంగం వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. విపత్తు నిర్వహణ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నేతృత్వంలో ఉన్నత అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రిపోర్టును పరిశీలించి ఈ రోజు రాత్రికి మీడియాకు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. స్కానింగ్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో మాత్రమే తవ్వకాలు జరిపి కార్మికులను బయటకు తీయాలని భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిందిలా!
ఎస్ఎల్బీసీ సొరంగంలో 14వ కిలో మీటర్ పాయింట్ వద్ద ఈ నెల 22న ఉదయం 8.20 గంటలకు ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు వచ్చి టన్నెల్ బోర్ మిషన్‌పై పైకప్పు కూలింది. ఈ క్రమంలో టీబీఎం ముందు భాగంలో పనులు చేస్తున్న ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు అందులో చిక్కుకుపోయారు. గత ఏడు రోజుల నుంచి తూతూ మంత్రంగా సహాయక చర్యలు కొనసాగించారు. ఈ ప్రమాదం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.