వికారాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రోజుకు ఎనిమిది గంటలు కరెంటు కోతలు పెడితే పంటలెట్ల పండించుకోవాలని వికారాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు. మొన్నటి వరకు 4 గంటల కోతలు విధించగా వారం రోజులుగా ఎనిమిది గంటలు కోతలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దుపోయిన తర్వాత త్రీ ఫేజ్ కరెంట్ సరఫరాను నిలిపివేసి అర్ధరాత్రి దాటిన తర్వాతే త్రీ ఫేజ్ సరఫరా చేస్తుండటంపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అధికారికంగా వ్యవసాయానికి కరెంట్ కట్ చేస్తున్నట్టు సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న ఆపరేటర్లు వెల్లడిస్తున్నారు. మరోవైపు అభివృద్ధితోపాటు వ్యవసాయానికి కరెంట్ సరఫరాలోనూ సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూర్ నియోజకవర్గాలపై శీతకన్ను చూపిస్తుండటం గమనార్హం. కొడంగల్ నియోజకవర్గం మినహా మిగతా మూడు నియోజకవర్గాల్లో వ్యవసాయానికి 8 గంటలపాటు అధికారికంగా పవర్ కట్ చేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని కేసీఆర్ చెప్పిన విధంగానే జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. అధికారికంగా 8గంటల పాటు కట్ చేస్తుండటంతోపాటు ఓ టైమ్ అంటూ లేకుండా మిగతా వేళల్లోనూ అనధికారికంగా ఓవర్ లోడ్ పేరిట కోతలు విధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
నీళ్లు లేక మక్కజొన్న ఎండిపోతాంది
రెండు ఎకరాల్లో మక్కజొన్న సాగుచేస్తున్న. మొన్న మరో బోరు వేసిన. ధారూరు మండలం పులిచింతల మడుగుతండాలో కరెంట్ సమస ఉంది. పంటకు సరిపడా నీరు అందుతలేదు. కొద్దిదూరం పారంగనే కరెంట్ పోతుంది. మళ్లీ ఎప్పుడస్తందో తెల్వదు. రాత్రీపగలు పొలాల వద్దే కావాలి ఉంటున్నం. ఇదివరకు కేసీఆర్ సర్కార్ ఇచ్చినట్టు 24గంటల ఫుల్ కరెంట్ ఇయ్యాలె.
– గోపాల్‌నాయక్, పులిచింతల మడుగు తండా, ధారూర్, వికారాబాద్