హైదరాబాద్ : నియోజకవర్గంలోని పాటిగడ్డలో 20 బెడ్స్ ఆస్పత్రి నిర్మాణానికి కావలసిన నిధుల కోసం కృషి చేస్తానని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాటిగడ్డ లో నివాసముంటున్న పేదలు ఆస్పత్రికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన మంత్రికి విన్నవించారు. ముఖ్యంగా గర్భిణిలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, స్థానికంగా 20 బెడ్స్ ఆస్పత్రిని నిర్మించాలని కోరారు .
దీంతో స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆస్పత్రికి అవసరమైన ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. బుధవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంఐడీసీ ఎస్ఈ సురేందర్ రెడ్డి, ఇతర అధికారులు మంత్రిని కలిసి నూతన ఆస్పత్రి భవనానికి సంబంధించిన నమూనాను మంత్రికి వివరించారు.
ఆస్పత్రి భవన నిర్మాణానికి కావలసిన రూ. 6 కోట్లు నిధులు మంజూరుకు మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి మంజూరికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి చెప్పారు.