హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకొన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎత్తుగడలు వేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో రెండున్నరేండ్ల పాలనా వైఫల్యాల చర్చ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అమలు కాని హామీలు, విచ్చలవిడి అవినీతి, కాంగ్రెస్ నేతల అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో అది వ్యతిరేక ఓటుగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నివేదికలు అందినట్టు సమాచారం. దీంతో డైవర్షన్ స్కీమ్‌ను నమ్ముకున్నట్టు చర్చ జరుగుతున్నది. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఫోన్‌ట్యాపింగ్ కేసుపై సిట్‌ను తెరమీదికి తీసుకొచ్చారని చెప్తున్నారు.
కేసీఆర్‌నే టార్గెట్ చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించడంతోపాటు కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే జాతిపిత అంశాన్ని ఎత్తుకున్నారనే చర్చ జరుగుతున్నది. తెలంగాణ సాధకుడిగా, అభివృద్ధి ప్రదాతగా, తెలంగాణ ఆత్మకు ప్రతిబింబమైన కేసీఆర్ ‘తెలంగాణ జాతిపిత’ అవునా? కాదా? అనేదానిపై అసలు చర్చే అవసరం లేదని, కానీ డైవర్షన్‌లో భాగంగానే ఈ అంశాన్ని సాగదీస్తున్నారని అంటున్నారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎవరి స్థాయిలో వాళ్లు ‘ప్రతి పనికో రేటు’ ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలు చెత్త కుప్పలు, మురుగు కాలువలు, దెబ్బతిన్న రోడ్లు, వెలగని వీధి దీపాలతో అస్తవ్యస్తంగా మారాయని ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పట్టణాలు, నగరాల్లో దోమలు విజృంభిస్తున్నాయని, దోమల నివారణ కోసం కనీసం ఫాగింగ్ కూడా చేసే పరిస్థితి లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ రెండున్నరేండ్లలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో సుమారు రూ.2,500 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలు చేస్తున్న పన్నుల సొమ్మును మౌలిక వసతులు, పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉండగా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దారిమళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నదని, వివిధ రకాల పన్నులు వసూలు చేయడానికి ఈ శాఖను ఉపయోగించుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా హామీలలో ఈ రెండున్నరేండ్ల కాలంలో ఒక్క దానినీ ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్, పెన్షనర్లకు పింఛను సొమ్ము ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు గుర్తుచేస్తున్నారు. చివరికి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లకు కూడా సకాలంలో జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితి నెలకొన్నదని, ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ సీమ్ అమలుపై ఇప్పటివరకు చర్చే లేదని పెదవి విరుస్తున్నారు.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ వేస్తామని హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తమపైకి పోలీసులను ప్రయోగిస్తున్నదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. కొత్త నియామకాలు లేకుండా పాత నోటిఫికేషన్లకే నియామక పత్రాలు అందించి కొత్త ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాగ్దానంపై ఇప్పటివరకు కనీస చర్చే లేదని గుర్తు చేస్తున్నారు. విద్యాభరోసా కార్డులు, బస్తీల్లో పాఠశాలల నిర్మాణం, ఐఐటీల ఏర్పాటు వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేదని అందరికీ తెలిసిందే. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ బాగుచేశారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నిరంతరాయ ఉచిత కరెంటు, రుణమాపీ తదితర పథకాలతో వ్యవసాయానికి పునరుజ్జీవం పోశారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్లలో రైతులు చితికిపోయారని, కనీసం పంటకు సరిపడా ఎరువులు కూడా ఇవ్వలేదని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుబంధు, రుణమాఫీ, రైతుభరోసా వంటి కీలక హామీలు సరైన సమయానికి అమలుకాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకు పూర్తిగా జరగలేదనే విమర్శలు ఉన్నాయి. ‘కేసీఆర్ ప్రభుత్వం నాటుకు, నాటుకు మధ్య రైతుబంధు వేస్తే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓటుకు, ఓటుకు మధ్య రైతుభరోసా ఇస్తున్నదని’ స్వయంగా రైతులే విమర్శిస్తున్నారు.
రెండున్నరేండ్లలో అన్నిరంగాల్లో విఫలమైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్‌ను నమ్ముకున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బూతులు మాట్లాడటం ఇందులో భాగమేనని అంటున్నారు. ఓవైపు ఫోన్‌ట్యాపింగ్ కేసు, మరోవైపు బీఆర్ఎస్ అగ్రనేతలపై బూతులు, ఇంకోవైపు కేసీఆర్ జాతిపిత అవునా? కాదా? అని అనవసర చర్చ లేవనెత్తడం వంటివి బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయిలో దారిమళ్లించే కుట్రగా అభివర్ణిస్తున్నారు.
అయినా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తమ లక్ష్యాన్ని మరువడం లేదని, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నిజానికి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని హితవు పలుకుతున్నారు. చెప్పుకొనేందుకు ఒక్క పథకం కూడా లేకపోవడం వల్లే అనవసర రాద్ధాంతం చేసి, రాజకీయ చర్చ నుంచి ప్రజలను దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.