మోర్తాడ్, జూలై 23: వరద కాలువ బోసిపోతున్నది. వర ప్రదాయిని వట్టిపోతున్నది. ఏడేండ్ల తర్వాత జల కళ లేక ఎండిపోయి కనిపిస్తున్నది. రైతులెవరూ ఊహించలేదు ఏడాదంతా నిండుకుండలా ఉండే వరదకాలువ నీటి రాక కోసం ఎదురుచూస్తున్నదని. ఉమ్మడి రాష్ట్రంలో నిర్జీవంగా మారిన వరద కాలువను బీఆర్ఎస్ పాలనలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో జీవధారగా మార్చారు. ఏడాదంతా నిండుకుండలా తొణికిసలాడే ఈ కాలువకు ప్రస్తుత ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తే ఎక్కడ కేసీఆర్‌కు పేరువస్తుందోనని పట్టించుకోని కారణంగా వరదకాలువ వట్టిపోతున్నది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కెనాల్‌కు జీవం పోయడంతో 122 కిలో మీటర్ల వరద కాలువ పరిధిలో రైతులకు వ్యవసాయం పండుగలా మారింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఇప్పుడది జల కళ కోల్పోయింది. ఈ నేపథ్యంలో సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. పునరుజ్జీవ పథకంలో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి బరాజ్ మీదుగా వరదకాలువకు నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాల్కొండ నియోజకవర్గ రైతుల పరిస్థితి తలాపున పారుతుంది గోదారి.. మన సేను సెలుక ఎడారి అనే పరిస్థితులు ఉండేవి. నియోజకవర్గంలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, పెద్దవాగు, గోదావరి నదుల ప్రవాహం ఉన్నా సాగు, తాగునీటికి నానా ఇబ్బందులు ఉండేవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సాగు, తాగునీటి కష్టాలు దూరం చేసింది. పునరుజ్జీవ పథకం ద్వారా వరదకాలువకు జీవం పోయడం, దానికి తూములు ఏర్పాటు చేసి చెరువులు నింపుకునేలా చేయడంతో భూగర్భ జలాలు పెరగడం ద్వారా సాగునీటి కష్టాలు లేకుండా పోయాయి.
అయితే, రేవంత్ సర్కారు రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలోకి నీటిని ఎత్తిపోసేందుకు సుముఖత చూపడం లేదు. దీంతో కర్షకులకు మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం వెరసి రైతులు మొగులుకు ముఖం పెట్టడం తప్ప చేసేదేమి లేదన్నట్లుగా పరిస్థితి నెలకొంది. బాల్కొండ, ముప్కాల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో పంటలసాగు ప్రశ్నార్థకంగా మారింది.
2019 వరకు వరదకాలువలో నీళ్లు సరిగా ఉండేవి కాదు. నీటిని నిలువ ఉంచుకునేందుకు ఆయా గ్రామాల రైతులు తమ గ్రామ పరిధిలో ఉన్న వరదకాలువలో కట్టలు నిర్మించుకునే పరిస్థితి ఉండేది. ఇలా చేయడంతో కింది గ్రామాలకు నీరు రావడం లేదని పల్లెల మధ్య వివాదాలు కూడా జరిగేవి. అటువంటి పరిస్థితి నుంచి ఎల్లప్పుడు నిండుకుండలా ఉండేలా కేసీఆర్ పునరుజ్జీవ పథకం తీసుకొచ్చారు. ఈ పథకంతో జీవ నదిగా మార్చిన తొలిరోజు ఇప్పటి వరకు వరదకాలువ నిండుకుండలా ఉండేది. కానీ కాంగ్రెస్ పాలకుల చోద్యం వల్ల ఏడు సంవత్సరాల తర్వాత వరదకాలువ నీళ్లు లేక వెలవెలబోతున్నది. శ్రీరాంసాగర్ నుంచి మిగులు జలాలను పంపేందుకు వరదకాలువ నిర్మాణం జరిగింది. అయితే, ఈ కాలువ నిర్మాణంలో ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం వల్ల తీవ్రజాప్యం జరిగింది. 1991లో పనులు చేపడితే, 2010లో ప్రారంభానికి నోచుకున్నదంటే అప్పటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులపై చూపిన వివక్షకు సజీవసాక్ష్యంగా చెప్పవచ్చు.
గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండిపడిన సమయంలోనే రైతులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. దీంతో యాసంగి పంటలకు అధికారులు మూడు సార్లు రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని వరద కాలువకు మళ్లించారు. ప్రస్తుతవర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా రివర్స్‌పంపింగ్ ద్వారా వరదకాలువను నింపాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో ఉన్న 15 టీఎంసీల నుంచి 4 టీఎంసీలను సాగునీటి కోసం విడుదల చేయాలని అధికారులను కోరారు. కానీ వరదకాలువకు ఇప్పటి వరకు నీటిని వదలలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రివర్స్‌పంపింగ్ మాత్రమే శరణ్యమయ్యేట్టు కనిపిస్తుండడంతో ఉద్యమంతోనైనా నీటిని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రైతులు ఏకమవుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి పాలనలో కేవలం వరదకే పరిమితమైన వరద కాలువను కేసీఆర్ బహుళ ప్రయోజకారిగా మార్చారు. 122 కి.మీ. వరదకాలువను పునురుజ్జీవ పథకం ద్వారా నింపి మూడు రిజర్వాయర్లుగా మార్చి, నీళ్లను ఒడిసిపట్టేలా చేశారు. దీని వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగడంతో పాటు వరదకాలువకు ఏర్పాటు చేసిన 34 తూముల ద్వారా 80 చెరువులు నింపుకునేలా చేసి అన్నదాతలకు వరప్రదాయినిగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. కానీ ప్రస్తుతం ఈ కాలువ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. గత అక్టోబర్ 9న మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండిపడడంతో అప్పటి నుంచి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయలేదు. యాసంగి పంటలను గట్టెక్కించేందుకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరిక మేరకు మూడుసార్లు వరదకాలువకు ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోశారు. అయితే, ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, కాలువలో నీళ్లు లేని కారణంగా కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి వరదకాలువ నింపాలని రైతులు కోరుతున్నారు.
వరద కాలువకు బాల్కొండ నియోజకవర్గంలో 9 తూములను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 16 చెరువులను నింపడం, మూడు చెక్‌డ్యాంలోకి నీటిని పంపడం ద్వారా 1,529 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తారు. వరదకాలువను జీవధారగా మార్చి, ఇంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాక.. కాలువలో నీళ్లు లేకుండా చూస్తున్న పాలకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి వద్ద 7టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో తప్పనిసరిగా కన్నెపల్లి పంప్‌హౌజ్‌లను ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తే తప్ప వరదకాలువకు నీటిని తెప్పించే పరిస్థితులు లేవని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కన్నెపల్లి మోటర్లను ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వరదకాలువలో నీళ్లు ఉంటే సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని, రాజకీయ కోణంలో కాకుండా రైతుల పక్షాన ఆలోచించి ఎత్తిపోతల ద్వార వరదకాలువను నింపాలని విన్నవిస్తున్నారు.
వరదకాలువ సమీపంలో ఆరెకరాల్లో వరి వేసిన. చిన్న జల్లుల కారణంగా పంటకు ప్రాణం పోసినట్లయ్యింది. వర్షాలు పడకపోతే వరద కాలువనే ఆధారం. కాలువలో నీళ్లు లేకపోతే పంట పండుడు కష్టమే. గత కొన్నేండ్లుగా వరద కాలువ ఉండడంతో సాగునీటి కష్టాలు చూడలే. కానీ ఇప్పుడు మొదటిసారి మళ్ల పాతరోజులొచ్చినయనిపిస్తుంది. అధికారులు దయతలచి వరదకాలువకు నీళ్లు తీసుకురావలే.
– మల్కాయి రాజన్న, రైతు, కమ్మర్పల్లి
పది నెలలుగా వరదకాలువలో సరిగా నీళ్లు లేకపోవడం, వర్షాలు పడవని చెప్తుండడంతో ఈసారి వరి పంట వేయలేదు. వరదకాలువలో నీళ్లు ఉంటే వరికి సాగునీరు ఇచ్చేందుకు ఢోకా ఉండేది కాదు. కానీ ఈసారి నీళ్లు లేని కారణంగానే నాట్లు వేయలేదు. వేసిన మక్కజొన్న, పసుపు పంటలు కూడా పండుతాయా లేదా అన్న ఆందోళనతో ఉన్నాం. రివర్స్ పంపింగ్‌తో వరదకాలువకు నీళ్లు తెప్పిస్తే పంటల సాగుకు ఇబ్బందులు దూరమవుతాయి.
– సింగిరెడ్డి గంగాధర్, రైతు, కమ్మర్పల్లి