మలక్‌పేట, జూలై 23: మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కోల్పోయిన మూసారాంబాగ్‌లోని అంబేద్కర్ బస్తీవాసుల్లో కొందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వం, మరికొందరికి మంజూరు చేయకపోవటంతో గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇచ్చినవారికే రెండుసార్లు ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం.. తాము 30 ఏళ్లుగా స్థానికంగా మురికికూపాల్లో నివసిస్తున్నప్పటికీ తమకు ఇండ్లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ సర్కార్ ఇచ్చినవారికే రెండుసార్లు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, అదికూడా కనీసం గుడిసె కూడా లేకుండా జిల్లాల్లోని గ్రామాల్లో నివాసముంటున్న స్థానికేతరులకు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేపట్టి స్థానికంగా ఉండే మూసీ బాధితులకు పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.