న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: మతపరమైన కారణాల వల్ల వందేమాతరం గేయంలోని ఆరు చరణాలనూ పాడని వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. జాతీయ గేయాన్ని అవమానించడాన్ని నేరం గా పరిగణించే 2026 జాతీయ గౌరవానికి అవమానాల నివారణ(సవరణ) చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, వీ మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
రెండు వారాల్లోగా పిటిషన్పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. ఈ ఏడాది ఆగస్టు 6న రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ చట్టం జాతీయ గీతం జనగణమనకు ఉన్నటువంటి చట్టపరమైన రక్షణనే జాతీయ గేయం వందేమాతరంకు కూడా కల్పిస్తున్నది. జాతీయ గేయాన్ని పాడకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా దానిని ఆలపిస్తున్న సభకు అంతరాయం కలిగించడం వంటి చర్యలకు మూడేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఈ చట్టం పేర్కొంటున్నది.
ఈ చట్టానికి ఇటీవల చేసిన సవరణలతో పాటు ప్రభుత్వ, అధికారిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో వందేమాతరం గేయంలోని ఆరు చరణాలనూ తప్పనిసరిగా ఆలపించాలని ఫిబ్రవరిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీచేసిన ఆదేశాలను కూడా కృష్ణ సవాలు చేశారు. గతంలో మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించేవారు.
1986 నాటి బిజో ఇమాన్యుయేల్ కేసులో గుర్తించినట్టుగా నాలుగు చరణాలను పాడకుండా ఉండే వ్యక్తి హక్కుకు రక్షణ ఉన్నదో, లేదో పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. బిజో ఇమాన్యుయేల్ తీర్పులో గౌరవపూర్వకంగా నిశ్శబ్దంగా నిలబడి, జాతీయ గీతం పాడటానికి నిరాకరించినందుకు విద్యార్థులను బహిష్కరించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.