మత్యకారుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతున్నట్లే కనిపిస్తున్నది. గతంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ సర్కారులో మత్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ప్రతి సంవత్సరం సకాలంలో జలవనరుల్లో సబ్సిడీపై ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేది. దీంతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 వేల మత్యకారుల కుటుంబాలకు ఉపాధి దొరికేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఉచిత చేప పిల్లలు ఎప్పుడు పంపిణీ చేస్తారో ? చేస్తారో ? లేదో ? తెలియక మత్యకారులు అయోమయానికి గురవుతున్నారు. ఆలస్యంగా పంపిణీ చేస్తే ఉపాధి ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 60 మత్య సహకార సంఘాలున్నాయి. వీటిలో 2750 మంది సభ్యులున్నారు. కుమ్రం భీం ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు మరో 350 మంది లైసెన్స్ గల మత్స్యకారులున్నారు. జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5 వేల కుటుంబాలు చేపల వేటను జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు బీఆర్ఎస్ పాలనలో జిల్లాలోని 243 చెరువుల్లో, 11 పెద్ద చెరువుల్లో, నాలుగు రిజర్వాయర్లలో 1. 38 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. చేప పిల్లల పంపిణీ ద్వారా ప్రతి మత్యకారుడి కుటుంబానికి రూ.25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఆదాయం సమకూరింది. కానీ ఈ ఏడాది ఇంత వరకు చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ముందుకు సాగకపోతుండడంతో మత్స్యకారుల్లో ఆందోళన కలుగుతున్నది.
బీఆర్ఎస్ హయాంలో 8 ఏళ్ల పాటు ఉచితంగా పంపిణీ..
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిదేళ్ల పాటు జలాశయాల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. దీంతో మత్యకారులకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రతి కుటుంబానికీ మంచి ఆదాయం సమకూరుతూ వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేప పిల్లల పంపిణీలో ప్రతి ఏటా జాప్యం వహిస్తుండడంతో మత్యకారులు ఉచిత చేప పిల్లలపై ఆశలు వదులుకోవాల్సి వస్తున్నది. చేప పిల్లల పంపిణీ కోసం అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఉంటుందో లేదో తెలియడం లేదు. దీంతో ఈ ఏడాది జలాశయాల్లో ఉచిత చేప పిల్లలు పంపిణీపై అనుమానాలు కలుగుతున్నాయి. ఫలితంగా చేపల వేటపై ఆధారపడి జీవించే మత్యకారుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.
ఆలస్యంగా పంపిణీతో నష్టం..
గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జలాశయాల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టింది. పెద్ద జలాశయాల్లో మాత్రమే వేయడంతో మత్స్యకారులకు పూర్తిస్థాయిలో ఉపాధి దొరకలేదు. అది కూడా జూలై, ఆగస్టు నెలల్లో వేయాల్సిన చేప పిల్లలను వర్షాకాలం ముగిసే సమయంలో వేయడంతో చేప పిల్లల్లో ఎదుగుదల లేక పోవడంతో బరువు పెరగలేదు. దీంతో మత్యకారులు నష్టపోవాల్సి వచ్చింది. ఈ సారి చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందో లేదో స్పష్టత లేకపోవడంతో మత్యకారులు అయోమయానికి గురవుతున్నారు. కనీసం ఈ ఏడాదైనా మత్యకారులకు ప్రభుత్వం ఆర్థిక లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని మత్యకారులు డిమాండ్ చేస్తున్నారు.