హైదరాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ ఎవరనే విషయమై ఇంజినీర్లలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ప్రముఖంగా ఇద్దరి పేర్లు ఇప్పటికే చర్చకు వచ్చినా ఎవరినీ ఖరారు చేయకపోగా, ముఖ్యమంత్రి, మంత్రికి మధ్య పేచీయే అందుకు కారణమని జలసౌధ వర్గాలు చర్చించుకుం టున్నాయి. మరోవైపు కీలకమైన జనరల్ స్థానాన్ని వారం రోజులైనా భర్తీ చేయకుండా, కనీసం ఇన్చార్జిని కూడా నియమించకపోవడంపై ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్లో ఈఎన్సీ(జనరల్) స్థానం అత్యంత కీలకం. గతంలో ఈ శాఖను 19 టెరిటో రియల్స్‌గా విభజించగా మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఆయా చీఫ్ ఇంజినీర్లకే బాధ్యతలను అప్పగించింది.
అన్ని విభాగాలపై పూర్తిస్థాయి నిర్ణయాధికారాన్ని ఈఎన్సీకే కట్టబెట్టింది. ఇరిగేషన్ శాఖ, డ్యామ్ సేఫ్టీకి సంబంధించి రాష్ట్రస్థాయి కమిటీల్లోనూ ఈఎన్సీకే పూర్తి అధికారాలున్నాయి. ఇప్పటివరకు ఈఎన్సీగా పనిచేసిన అమ్జద్ హుస్సేన్ జనవరి 31న విరమణ పొందారు. సాధారణంగా కీలకమైన స్థానం ఖాళీ అవుతుంటే ముందుగానే తాత్కాలికంగానైనా ఇన్చార్జిని నియమించడం పరిపాటి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజులైనా భర్తీ చేయకపోగా, ఎప్పుడు నియమిస్తారనేది కూడా స్పష్టత లేదు.
ఈఎన్సీ జనరల్ స్థానం భర్తీ కాకపోవడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ మధ్య పేచీనే కారణమనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. వాస్తవంగా ఇటీవల సీఈ నుంచి ఈఎన్సీగా ప్రమోషన్లను కల్పిస్తూ డీపీసీ ఆమోదం తెలిపింది. అందులో ప్రస్తుతం కరీంనగర్ ఈఎన్సీ మధుసూదన్‌రావు, డీజీ వాలంతరీ అనిత, సూర్యాపేట సీఈ, ప్రస్తుత ఈఎన్సీ(అడ్మిన్) రమేశ్‌బాబు ఉన్నారు. సీనియార్టీ జాబితాలో ముందున్నా కూడా కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్టును సాకుగా చూపి ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్‌కు ప్రమోషన్‌ను కల్పించలేదు. కేవలం ఓఅండ్ఎం ఇన్చార్జి ఈఎన్సీ అదనపు బాధ్యతలనే అప్పగించింది.
ఇక మిగిలిన ముగ్గురిలో ఈఎన్సీ జనరల్‌గా ఎవరిని నియమించాలనే దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈఎన్సీ అడ్మిన్ రమేశ్‌బాబుకే ఈఎన్సీ(జనరల్) ఇన్చార్జి బాధ్యతలను అదనంగా అప్పగించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌తో పాటు ఓ ఉన్నతాధికారి సైతం పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయగా వాటిని సీఎం రేవంత్‌రెడ్డి పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది. అడ్మిన్, ఓఅండ్ఎం ఈఎన్సీలు ఇద్దరూ మార్చిలో విరమణ పొందనున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ విరమణ పొందిన ఈఎన్సీ జనరల్ అమ్జద్ హుస్సేన్‌కే మరో ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చేందుకు సీఎం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఈఎన్సీ పోస్టు భర్తీ కావడం లేదని తెలుస్తున్నది.
కాంగ్రెస్ సర్కార్ అలసత్వం సీనియర్ ఇంజినీర్లకు శాపంగా మారింది. సీనియర్లకు ఈఎన్సీగా అవకాశం దక్కకుండా పోతున్నది. శాఖలో మొత్తంగా 19 సర్కిల్స్ ఉండగా, అన్ని విభాగాలు కలిపి 23 సీఈ పోస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 13 మందికిపైగా సీఈలు విమరణ పొందారు. ప్రమోషన్లను కల్పించి భర్తీ చేయాలని ఇంజినీర్లు అనేకసార్లు విన్నవించినా సర్కారు పెడచెవిన పెట్టింది. ఎట్టకేలకు నిరుడు ఆగస్టులో ఆ 13మంది ఎస్ఈలకు సీఈలుగా ప్రమోషన్లు కల్పిస్తూ డీపీసీ ఆమోదం తెలిపింది. అందులోనూ తొలుత 8మందికే ప్రమోషన్లను ఇచ్చి, ఆ తర్వాత విడుతల వారీగా మిగతా వారికి ఉద్యోగోన్నతి కల్పించింది. ప్రస్తుతం ఈఎన్సీ పోస్టులు ఖాళీ అవుతున్నా సీనియర్ ఇంజినీర్లకు అవకాశం దక్కడం లేదు.
సర్కార్ నిర్లక్ష్యమే అందుకు ప్రధాన కారణం. సీఈ నుంచి ఈఎన్సీగా ప్రమోషన్ కల్పించాలంటే ఏడాది పాటు సీఈగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందనే నిబంధన ఇప్పుడు అడ్డంకిగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే, లేదా ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు పంపినప్పుడే ప్రమోషన్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిది కాదు. రేవంత్ సర్కార్ ఆలస్యంగా అంటే నిరుడు ఆగస్టులో ప్రమోషన్లు కల్పించడం వల్ల సీనియర్ ఇంజినీర్లు, సీఈలు ఈఎన్సీ అవకాశం పొందలేని దుస్థితి నెలకొన్నది. వెరసి సీఈలుగానే విరమణ పొందాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఖాళీ అయిన సీఈ పోస్టులను ప్రమోషన్లతో భర్తీ చేయాలని ఇంజినీర్లు కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఉన్న సీఈలకే అదనపు బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్నది. కొత్తగా ప్రమోషన్ పొందిన వారితో పాటు అన్ని కలిపి దాదాపు 13మందికి సీఈలు ఇప్పటికే విరమణ పొందారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, గజ్వేల్, కరీంనగర్, ఆదిలాబాద్, రామగుండం, జగిత్యాల, సీఈ ఎంక్వైరీస్తో పాటు ఇరిగేషన్ శాఖ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ(టెక్నికల్)కి సంబంధించి సీఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సీనియర్ ఎస్ఈలకు(సూపరింటెండింగ్ ఇంజినీర్) సీఈలుగా ప్రమోషన్లను కల్పించాల్సి ఉన్నది. ఈఎన్సీ తరహాలోనే ఏడాది పాటు ఎస్ఈలు విధులను నిర్వర్తించాల్సి ఉంది.
కానీ ప్రభుత్వం సకాలంలో ప్రమోషన్లను కల్పించకుండా తాత్సారం చేయడంతో సీనియర్ ఎస్ఈలు ప్రస్తుతం సీఈగా ప్రమోషన్లను పొందలేని దుస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, ఈఈ ఇలా ఏ పోస్టు ఖాళీ అయినా కూడా వెంటనే సీనియార్టీ జాబితాలో అక్కడే ఉన్న ఇంజినీరుకు, ఒకవేళ అక్కడ సీనియర్ ఇంజినీర్ లేకుంటే ఆ బాధ్యతలను పక్కనే ఉన్న ఇతర సర్కిల్‌కు చెందిన సీనియర్ ఇంజినీర్లకు బాధ్యతలను అప్పగించడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ నిబంధనలకూ తిలోదకాలిచ్చింది. నచ్చినోళ్లకు, పైరవీలు చేసినోళ్లకే బాధ్యతలను అప్పగిస్తున్నది. ఖాళీగా ఉన్న 13 సీఈ పోస్టుల్లో 7చోట్ల ఇటీవల పలువురికి తాత్కాలికంగా ఇన్చార్జిగా బాధ్యతలను అప్పగించింది. అందులో అర్హతలు ఉన్న కూడా పలువురు సీనియర్లను పక్కన పెట్టి మరీ జూనియర్లకు, విరమణ పొందిన వారికీ సీఈ ఇన్చార్జి బాధ్యతలను కట్టబెట్టింది. ఈ నిర్ణయంపై ఇంజినీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.