హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకానికి పరాకాష్ట. చట్టాలను తుంగలో తొక్కి, ధర్మాన్ని పక్కనబెట్టి, దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విచ్చలవిడితనానికి మరో ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారంటూ స్పీకర్‌తో క్లీన్చిట్ ఇప్పించి.. వెంటనే ఇప్పుడు సదరు ఫిరాయింపుదారులకు పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది.
టీపీసీసీ గురువారం విడుదల చేసిన జాబితాతో వారు ఏ పార్టీలో కొనసాగుతున్నారో తేటతెల్లమైంది. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ప్రకాశ్‌గౌడ్ బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ జెండా మోస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 6వ తేదీలోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో స్పీకర్ అనివార్యంగా ఫిరాయింపుదార్ల మీద విచారణ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిరాయింపు ఆరోపణలను ఎదురొంటున్న ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాద య్య, సంజయ్‌కుమార్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవంటూ తీర్పు చెప్పారు. కేవలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాం.. కానీ పార్టీ మారలేదని ఫిరాయింపు ఆరోపణలున్న ఎమ్మెల్యేలు చెప్పిన మాటలతో తాను ఏకీభవిస్తున్నట్టు స్పీకర్ ప్రకటిస్తూ కేసు కొట్టివేశారు.
స్పీకర్ చివరగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నామంటూ బుధవారం తీర్పు వెలువరించారు. తీర్పు చెప్పి 24 గంటలు గడువక ముందే వారు కాంగ్రెస్ గూటిలోనే ఉన్నారని స్వయంగా టీపీసీసీ ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున కో-ఆర్డినేటర్లను నియమిస్తూ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు కలిపి 123 మంది కో-ఆర్డినేటర్లను నియమించింది.
వీరిలో స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చిన ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ కోఆర్డినేటర్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీ కో ఆర్డినేటర్‌గా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షాద్‌నగర్ మున్సిపాలిటీ కోఆర్డినేటర్‌గా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటన నేపథ్యంలో స్పీకర్ తీర్పు మీద నీలినీడలు అలుముకున్నాయి.
‘మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్‌కు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షాద్‌నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కాంగ్రెస్ తరఫున కోఆర్డినేటర్లుగా నియమిస్తున్నాం. ఈ జాబితాను ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ఆమోదించారు’
– ఇదీ గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విడుదల చేసిన అధికారిక ప్రకటన.