న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించకుండానే లోక్‌సభలో తీర్మానం ఆమోదం పొందడానికి దారితీసిన పరిస్థితులపై స్పీకర్ ఓం బిర్లా గురువారం స్పందించారు. బుధవారం లోక్‌సభకు రావద్దని ప్రధాని మోదీని తానే అర్థించినట్లు స్పీకర్ వెల్లడించారు. లోక్‌సభలో ప్రధాని మోదీ సీటును బుధవారం విపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు చుట్టుముట్టిన దరిమిలా లోక్‌సభలో తీవ్రస్థాయిలో రభస జరిగింది. ప్రధా ని ప్రసంగించకుండానే సభ గురువారానికి వాయిదాపడింది. ఈ ఘటనలపై గురువారం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభలో స్పం దించారు.
ఏదైనా అవాంఛనీయ ఘటన జరుగవచ్చన్న కారణంగా సభకు రావద్దని నేనే ప్రధానిని అర్థించాను. కొందరు విపక్ష సభ్యులు అధికార పక్షం వైపు వచ్చారు. వారి ప్రవర్తన పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని గురువారం సభను వాయిదా వేయడానికి ముందు స్పీకర్ వ్యాఖ్యానించారు. చేతిలో బ్యానర్ల్లు పట్టుకుని ప్రధాని మోదీ సీటు చుట్టూ మోహరించిన కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహిళా ఎంపీల ప్రవర్తనపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రభస కొనసాగడంతో గురువారం కూడా ప్రధాని సభలో ప్రసంగించలేకపోయారు. విపక్ష సభ్యులది అనుచిత, అమర్యాదకర ప్రవర్తనగా అభివర్ణించిన స్పీకర్ సభ లోపలకు బ్యానర్లు, పోస్టర్లు తీసుకువస్తే సభ నడవదని హెచ్చరించారు.
కాగా, బుధవారం సభలో నెహ్రూ-గాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఎంపీలు గురువారం సభలో అలజడి సృష్టించారు. ముందస్తు నోటీసు లేకుండా ఇతరులపై విమర్శలు చేయకూడదంటూ స్పీకర్ ఇటీవల ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్ గుర్తు చేసింది. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను విమర్శించేందుకు ఓ అముద్రిత పుస్తకాన్ని ఉటంకించడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రయత్నించిన సందర్భంగా స్పీకర్ ఈ రూలింగ్ ఇచ్చారు.
అవాంఛనీయ ఘటనను నివారించేందుకు సభకు హాజరుకాకూడదని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సరైనదని బీజేపీ ఎంపీలు సంజయ్ జైస్వాల్, అపరాజితా సారంగి సమర్థించారు. లోక్‌సభలో తన సీటుకు వెళ్లే మార్గానికి అడ్డుగా విపక్ష మహిళా సభ్యులు నిలబడ్డారని, వారి చేతిలో అసభ్యకరంగా రాసిన బ్యానర్లు ఉన్నాయని సారంగి చెప్పారు. తన గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రధాని సభలోకి రాలేదని ఆమె చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ జవాబును అడ్డుకుని సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించిన మహిళా ఎంపీలపై చర్యలు తీసుకోవాలని జైస్వాల్ డిమాండు చేశారు. కాగా, దూబేపై చర్య తీసుకోవలసిందేనని విపక్ష ఎంపీలు కూడా తమ డిమాండును కొనసాగిస్తున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయలేదని, గుజరాతీ ఇంటిపేరును కూడా దొంగిలించిందని ఆరోపించారు. తన ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాతీ అయిన మహాత్మా గాంధీ ఇంటి పేరును కూడా దొంగలు చోరీ చేశారని గాంధీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని చురకలు అంటించారు. మీరు నాపై ఎన్ని నినాదాలు చేసినా నా సమాధిని తవ్వలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తన సొంత స్టార్టప్‌నే చేపట్టలేని కాంగ్రెస్ స్టార్టప్ సంస్కృతిని ఏనాడూ ప్రోత్సహించ లేదని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీ తొలి తరానికి దేశం అవకాశమిచ్చిందని, కాని గరీబీ హఠావో వంటి నినాదాలతో ప్రజలను వారు తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు. బీజేపీ ఎంపీ బిట్టూను ద్రోహిగా సంబోధించి రాహుల్ గాంధీ సిక్కులను, సిక్కు గురువులను అవమానించారని మోదీ చెప్పారు.
కాంగ్రెస్ మహిళా ఎంపీలు కొందరు బుధవారం లోక్‌సభలో తన సీటును అడ్డగించడంతో తాను ప్రసంగించలేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆ ఉదంతం చాలా బాధాకరమని మోదీ అన్నారు. అది రాష్ట్రపతిని, రాజ్యాంగాన్ని, భారతదేశ గిరిజనులను, మహిళలను అవమానించడమేనని ఆయన అన్నారు. తనకు 35 కోట్ల సవాళ్లు ఉన్నాయంటూ తన తండ్రి జవహర్లాల్ నెహ్రూను ఉటంకిస్తూ ఇందిరా గాంధీ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీకి భారత పౌరులందరూ సమస్యేనంటూ ఆయన విమర్శించారు. కాని తమకు పౌరులందరూ పరిష్కారకర్తలని ఆయన చెప్పారు.