హైదరాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మశక్యమేనా? అనే చర్చ జరుగుతున్నది. గతంలోనూ ఇలాంటి హామీలు చాలాసార్లు ఇచ్చారని, కానీ రైతుభరోసా మాత్రం దక్కలేదని రైతులు చర్చించుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఎన్నికలు పూర్తవగానే ఒక్కో రైతుకు ఎకరానికి రూ.15 వేలు పెట్టుబడి ఇస్తామంటూ ఆశ కల్పించారు. తీరా ఎన్నికలు నవంబర్‌లో పూర్తయ్యి డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే మే నెలలో రైతుభరోసా వేశారు. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన నిధులతోనే, ఎకరానికి రూ.5 వేల చొప్పున మాత్రమే జమ చేశారు. ఆ తర్వాత ఒక సీజన్ పూర్తిగా ఎగ్గొట్టి, మరో రెండు సీజన్లలో కోతలు పెట్టారు. ఇలా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు ఎప్పుడూ కచ్చితంగా అమలు కాలేదని, ఇప్పుడు కూడా అంతేననే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతున్నది. ‘ఎన్నికల తర్వాతే ఎందుకు.. ఎన్నికలకు ముందే రైతుభరోసా పంపిణీ చేయొచ్చు కదా’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం మాటలు చెప్పడం, ఆ తర్వాత హామీలు ఎగ్గొట్టడం సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్‌కు పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు, రైతుల్లో వ్యతిరేకత నెలకొన్నది. ఇది సర్పంచ్ ఎన్నికల్లో ప్రతిఫలించింది. ఇప్పుడు పార్టీల గుర్తుపై జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయితే, కాంగ్రెస్‌కు కష్టకాలం మొదలవుతుందనే ఆందోళన సర్కార్ పెద్దల్లో నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల గండం గట్టేందుకు మాయమాటలతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. మున్సిపాలిటీల్లోనూ భూములు గల రైతులు భారీ సంఖ్యలో ఉంటారు. కాబట్టి, వారి ఓట్లు ఇతర పార్టీలకు పడకుండా, కాంగ్రెస్‌పై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు గానూ రైతుభరోసాపై ఆశలు కల్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కూడా ‘ఎన్నికల గండం గట్టెక్కితే చాలు’ అనే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఎన్నికలకు, రైతుభరోసాకు లింకు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల తర్వాత రైతుభరోసా అంటే ఎగ్గొట్టడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయానికీ, ఎన్నికలకు ఏం సంబంధం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులకు అండగా నిలవాలన్న చిత్తశుద్ధి ఉంటే, పంటలు వేసే సమయంలో రైతుభరోసా ఇవ్వాలి కానీ, ఎన్నికలకు ముడిపెట్టి, ఆపడమెందుకనే ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వాస్తవానికి, రైతుభరోసా పెట్టుబడి సాయం సీజన్ ప్రారంభంలో, నాట్లు వేసే సమయంలో పంపిణీ చేస్తేనే రైతులకు ప్రయోజనం. డిసెంబర్, జనవరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారం కల్లా పంపిణీ పూర్తి చేస్తే ఆ మేరకు రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పుతుంది. కానీ, యాసంగి పంటల సాగు పూర్తవుతున్నా ప్రభుత్వం రైతుభరోసా పంపిణీపై ఎలాంటి కసరత్తు మొదలుపెట్టలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సీజన్లో రైతుభరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. అందుకే తాత్సారం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత రైతుభరోసా పంపిణీ చేస్తామంటూ మాయమాటలు చెప్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎంత వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో యాసంగి భరోసాను జనవరిలో ఇవ్వాల్సింది మేలో జమ చేసింది. ఆ తర్వాత వానకాలం రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. ఆ తర్వాత యాసంగిలో మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే పంపిణీ చేసి మిగిలినవారికి ఎగనామం పెట్టింది. ఒకే ఒక్కసారి గత వానకాలంలో రైతులు అందరికీ సమయానికి పంపిణీ చేసింది. తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేశామని ఘనంగా ప్రకటించుకున్నది. కానీ, ఈ యాసంగిలో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ సారి పూర్తిగా లేదా కొందరికి ఎగ్గొట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుభరోసా పే రిట నాటకాలాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసలు రైతు భరోసా ఇవ్వకుండా ఆపిందెవరు? అని సూటిగా ప్రశ్నించారు. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్లో వేయాల్సిన రైతుభరోసా ఇప్పటికీ వేయకపోవడంపై ఆగ్రహించారు. రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఏనాడూ మే డారం వెళ్లలేదని అబద్ధాలు చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన జాతరకు వెళ్లకుంటే ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు. రూ.250 కోట్లు వెచ్చించి కట్టిన మే డారం కట్టడాలు నెల తిరగకుండానే కుప్పకూలుతున్నాయని తెలిపారు. మోసాల సీఎం రేవంత్‌కు మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.