కమాన్‌పూర్/కమాన్‌పూర్/కాటారం, నవంబర్ 18: మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధుకర్ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ.. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
పుట్ట మధుకర్ హత్యకు కుట్రపై పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల బీఆర్ఎస్ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ కాటారం మండల ఇన్చార్జి జోడు శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, జిల్లా నేత జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు.