హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ‘విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. పదిహేను రోజుల్లో అన్ని వర్సిటీల్లో వీసీలు, ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలన్నింటినీ భర్తీచేస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తాం. పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పారు. ఇటీవల ఓయూలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘మనోళ్లు ఓయూకు ఐదు కోట్లు.. పది కోట్లు అడుగుతున్నరు. మనోళల్లో వందకోట్లు కూడా అడగలేనంత పేదరికమున్నది. ఏం కావాల్నో.. ఎంత కావాల్నో అడగలేనంత పేదరికంలో మనోళ్లు ఉన్నరు. మనకేం తక్కువ.. మూడు లక్షల కోట్ల బడ్జెట్ మనది. ఓయూకు వెయ్యికోట్లు ఇచ్చేందుకు నేను రెడీ. వందల కోట్ల నిధులు ఇస్తా. ఓయూను స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల స్థాయిలో తీర్చిదిద్దుతా’ అని ప్రకటించారు. అంతేకాకుండా విద్యాశాఖను తన వద్దనే ఎందుకు పెట్టుకున్నారో వివరిస్తూ ‘విద్యాశాఖకు మంత్రిని నియమించాలని నాకు చాలామంది సలహాలిచ్చారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మంత్రులను, అధికారులకు పిలవాల్సిన అవసరం లేకుండా విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ఈ శాఖను ఎవ్వరికీ ఇవ్వను. నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. ప్రతీ సమస్యను నిశితంగా అర్థం చేసుకుంటూ పరిష్కరిస్తున్నా’ అని చెప్పారు. ఈ మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయని విద్యావేత్తలు, ప్రొఫెసర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి మాటల్లో ఆచరణకు నోచుకోలేదని మండిపడుతున్నారు. తన పరిధిలోనే విద్యాశాఖ ఉంటే విద్యారంగానికి మేలు జరుగుతుందని సీఎం చెప్పుకుంటున్నా… దారుణంగా నష్టం వాటిల్లుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 12 వర్సిటీలలో 74 శాతం టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండటం, విద్యార్థులకు అందని నాణ్యమైన విద్య, పడిపోతున్న ప్రమాణాలే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
అధ్యాపకుల కొరతతో వర్సిటీల్లో బోధనలో నాణ్యత దెబ్బతింటున్నది. ఉన్న అధ్యాపకులపైనే పనిభారం పడుతున్నది. అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో వర్సిటీలను నెట్టుకొస్తున్నారు. సరిపడా బోధనా సిబ్బంది లేకపోతే వర్సిటీల ర్యాం కింగ్ దెబ్బతినే ప్రమాదముందని ఓయూ మా జీ వీసీ ప్రొ.తిరుపతిరావు అన్నారు. రిక్రూట్మెంట్ లేకపోవడంతో ప్రొఫెసర్, అసొసియే ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నిష్పత్తి దెబ్బతిన్నదని ఔటా అధ్యక్షుడు మనోహర్ ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని వర్సిటీల్లో సహాయ ఆచార్యుల రిక్రూట్మెంట్కు ఏప్రిల్ 4న సర్కారు జీవో -21 జారీ చేసింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఈ జీవోను ఇచ్చారని, సవరించాలని ఉన్నత విద్యామండలి, కొందరు వీసీలు ప్రభుత్వాన్ని కోరారు. జీవోను మార్చబోమని, సక్రమంగానే ఉందని ప్రభుత్వ పెద్దలు మొండిగా సమర్థించుకుంటున్నారని తెలిసింది. జీవోను మార్చాలని, ఎవరైనా కోర్టుకు వెళితే జీవో చెల్లుబాటు కాదని ఉన్నత విద్యామండలి వర్గాలు చెప్పినా సర్కారు పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
మహిళా వర్సిటీకి రూ.500 కోట్లు ఇచ్చామంటూ ప్రభుత్వ పెద్దలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నారు. కానీ ఇంతవరకు రూపాయి కూడా ఖర్చుచేయలేదు, కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. 600 కొత్త పోస్టులను మంజూరు చేయాలని వర్సిటీ అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ వర్సిటీ ఓయూ నుంచి విడిపోవడంతో ఓయూను విభజించాల్సి ఉన్నది. విభజన ఆప్షన్లలో అంతా ఓయూకే వెళ్తే మహిళా వర్సిటీ బోధన ప్రమాదంలో పడనున్నది. హాస్టల్, తరగతి గదులకు సీఎం రేవంత్‌రెడ్డి మార్చిలో శంకుస్థాపన చేశారు. పని అంతటితోనే ఆగిపోయింది. వర్సిటీ అధికారులు అడిగితే ఆగస్టులో పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఆగస్టు పోయింది.. అక్టోబర్ వచ్చినా ఒక్క అడుగూ పడలేదు.