హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ) : కేంద్రంలో బీజేపీ పాలనలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.53% కేటాయింపులు చేశారని విమర్శించారు. శుక్రవారం హైదారాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో సర్కారు చెలగాటం ఆడుతుందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్‌లోని లయన్స్‌క్లబ్ హాలులో మార్చి 1, 2 తేదీల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర తెలిపారు. సమావేశాల పోస్టర్‌ను హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని యూనియన్ భవన్లో శుక్రవారం వారు విడుదల చేశారు.