Telangana | కరీంనగర్ కమాన్ చౌరస్తా, హైదరాబాద్ ఏప్రిల్ 5: (నమస్తే తెలంగాణ ) : ‘డీఎస్సీ పరీక్షలో ఎక్కువ మార్కులొచ్చాయి. మెరిట్ ఉన్న ది. కానీ, టీచర్ ఉద్యోగం దక్కలేదు. చేయిదాకా వచ్చిన ఉద్యోగం చేజారింది. ఆ అభ్యర్థి తిరగని ఆఫీసులేదు. ఎక్కని మెట్టులేదు. ఈ ప్రయత్నంలో ఉద్యోగమైతే దక్కలేదు కానీ, మానసిక రోగి (పిచ్చివాడు) అయిపోయాడు’ ఇలాంటి బాధితులెందరో! ఇలాంటి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కరీంనగర్ జిల్లా. ఇది జరిగింది డీఎస్సీ-2002లో. బాధితులకు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఉద్యోగాల కోసం వెళ్తే రూ.ఐదు లక్షలు ఇస్తేనే ఉద్యోగాలిస్తామంటూ విద్యాశాఖలోని కొందరు బేరంపెట్టారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డీఎస్సీ-2002 లో అక్రమాలు జరిగాయి. అర్హులను పక్కనపెట్టి అనర్హులకు పోస్టులు కట్టబెట్టారు. హిందీ పండిట్ పోస్టుల భర్తీలో విచారణ చేపడితే 50కిపైగా పోస్టుల భర్తీలో ఉల్లంఘనలు జరిగినట్టు నిరూపితమైంది. 24 మందివి బోగస్ సర్టిఫికెట్లుగా గుర్తించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలోనూ అక్రమాలు జరిగిన ట్టు వెలుగులోకి వచ్చింది. 49 హిందీ పండిట్ గ్రేడ్-2 పోస్టులు, 85 ఎస్జీటీ తెలుగు మీడి యం పోస్టులు, 5 ఎస్ఏ గణితం పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయి. అప్పట్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ విచారణ జరిపి, నివేదికను విద్యాశాఖకు సమర్పించారు. అక్రమాలు నిజమేనని తేలడంతో 63 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
డీఎస్సీ-2002లో జరిగిన అక్రమాలపై జిల్లాలో ఐదుగురు అధికారులతో కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఇటీవలే విద్యాశాఖకు చేరింది. డైరెక్టరేట్‌లో శిష్యులైన ఉన్నతాధికారులు గురుభక్తిని ప్రదర్శించి నివేదిక బయటికి రాకుండా అడ్డుకున్నట్టు సమాచారం. అప్పట్లో ఇన్చార్జి డీఈవోగా పనిచేసిన ఒక అధికారి.. విద్యాశాఖ డైరెక్టరేట్‌లో కీలకం గా వ్యవహరించారు. సదరు అధికారి అన్నీ తానై వ్యవహరించారు. ఆయన శిష్యులే ఇప్పు డు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో కీలకంగా ఉన్నారు. దీంతో గురుభక్తితో ఆ నివేదికను తొక్కిపెట్టినట్టు, నివేదికను మార్చి రాయాలని ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమకు జరిగిన అన్యాయంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. 2024 ఏప్రిల్‌లో అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 22 ఏండ్ల సుదీర్ఘ పోరా టం తర్వాత ఉద్యోగాలొస్తాయని అభ్యర్థులు ఆశగా ఎదురుచూశారు. హైకోర్టు తీర్పు ఇచ్చి ఏడాది అవుతున్నది. కానీ, ఇంకా ఉద్యోగాలివ్వలేదు. దీనిపై కరీంనగర్ జిల్లా నుంచి నివేదిక అందలేదంటూ మెలికపెట్టారు. జిల్లా అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత తొక్కిపెట్టడమే కాకుండా మార్చి రాయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఒక అధికారి నివేదికను తయారుచేసిన అధికారిని చీవాట్లు పెట్టిన ట్టు తెలిసింది. ఇంత వివరంగా ఎవరు రాయమన్నారు అంటూ ఫైర్ అయినట్టు వార్తలొస్తున్నాయి. కోర్టు తీర్పునిచ్చినా ఉద్యోగ నియామకాలు ఆలస్యం కావడం తో కొందరు అభ్యర్థులు విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని ఒక ఉద్యోగిని సంప్రదించగా, రూ.ఐదు లక్షలు ఇస్తేనే ఉద్యోగాలిస్తామని బేరం పెట్టినట్టు ఆరోపిస్తున్నారు.