Telangana | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ యువత పోరుబాటలో ఉంటే, ప్రభుత్వం పంతానికి పోయి తన పని తాను చేసుకుపోతున్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా మొండివైఖరితో ముందుకు పోతున్నది. తాజాగా గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేస్తుంటే, అనూహ్యంగా 1:50 చొప్పన ఎంపిక చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు భగ్గుమన్నారు. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతినబూనారు. ఎన్నికల ముందునాటి కాంగ్రెస్ నేతల వైఖరికి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వ్యవహార శైలి విరుద్ధంగా ఉన్నదని ధ్వజమెత్తుతున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి అందుకు తీసుకుంటున్న వ్యతిరేక నిర్ణయాలే నిదర్శనమని పేర్కొంటున్నారు. ఎన్నికల ముందు నమ్మి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చిందని వారు కుమిలిపోతున్నారు. ఎన్నికల హామీలనే అమలు చేయాలని వారు కోరుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు
ఉద్యోగాల భర్తీ విషయంలో తాము చేస్తున్న డిమాండ్లను పరిశీలించకుండా, తమను చర్చలకు పిలువకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని నిరుద్యోగ యువత మండిపడుతున్నది. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు 1:50 ప్రకారం విడుదల చేయడానికి బాధ్యుడైన ముఖ్యమంత్రి నిరుద్యోగుల పట్ల తన మొండివైఖరిని బయటపెట్టుకున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు. ఈ ఘటనతో కావాలనే నిరుద్యోగులను సీఎం రెచ్చగొడుతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచడంపైనా ఆయన మాట మార్చారని, డీఎస్సీలో ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల సంఖ్య పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని నిరుద్యోగులు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలన్న అంశంపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేక పోవడంతోపాటు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని నిప్పులు చెరుగుతున్నారు.
కాంగ్రెస్ సర్కారుతో సమరమే..
విద్యార్థులు, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో సమరమేనని నిరుద్యోగులు కుండబద్ధలు కొడుతున్నారు. ఇప్పటికే ఆమరణ దీక్షలు, ముట్టడి, ధర్నా కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని తెలిపారు. నిరుద్యోగుల తరఫున ప్రస్తుతం బక్క జడ్సన్, అశోక్ ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి నుంచి కనీసం ఒక్క సానుకూల ప్రకటన రాలేదని వారు పేర్కొంటున్నారు. తమపై ఈ ప్రభుత్వానికి జాలి కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఇక నుంచి తమ కార్యాచరణ రూపొందిస్తామని నిరుద్యోగ జేఏసీ స్పష్టం చేసింది.
త్వరలో గవర్నర్‌కు ఫిర్యాదు
నిరుద్యోగుల ఆందోళనలకు దిగిరాని రాష్ట్ర ప్రభుత్వంపై త్వరలోనే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని జేఏసీ నేతలు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుకు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకను నిలదీయడానికి త్వరలోనే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
నేడు విద్యాశాఖ ఆఫీస్ ముట్టడి
డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలన్న డిమాండ్‌తో సోమవారం పాఠశాల విద్యాశాఖను ముట్టడిస్తామని నిరుద్యోగ జేఏసీ నేతలు తెలిపారు. ఈ ముట్టడిలో రాష్ట్ర నలుమూలల నుంచి స్వచ్ఛందంగా పాల్గొనడానికి డీఎస్సీ అభ్యుర్థులు హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. డీఎస్సీ అభ్యుర్థులకు మద్దతుగా ఓయూ విద్యార్థి జేఏసీ నేత మోతీలాల్‌నాయక్ సహా పలువురు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు పాల్గొంటారని ప్రకటించారు.