హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. ఈ ఏడాది 6 పేపర్లకే పరీక్షను నిర్వహించనుండగా, సైన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. దీంతో పరీక్షలు 7 రోజుల పాటు కొనసాగనున్నాయి. సైన్స్ రెండు పేపర్ల మార్కులను ఒకటిగానే పరిగణించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. 2024 మార్చి మూడో వారంలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎలాంటి జంకూ లేకుండా పరీక్షలు రాసేలా సన్నద్ధం చేసేందుకు ‘లక్ష్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పాఠశాల విద్యాశాఖ.
డిసెంబర్ నెల ఆరంభంలోనే లక్ష్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒత్తిడికి గురికాకుండా, అర్థవంతమైన అభ్యాసాలు విద్యార్థులతో చేయించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా బట్టీ విధానానికి దూరంగా, మైండ్ మ్యాపింగ్ ద్వారా సొంత మాటల్లో రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు లక్ష్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం యాక్షన్ ప్లాన్‌లో 50 శాతం బోధనకు, మరో 50 శాతం రోజులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి కేటాయించారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి జిల్లా, రాష్ట్రస్థాయిలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. టీశాట్ ద్వారా అవగాహన కల్పించడం, వ్యక్తిత్వ వికాస నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించడం, ప్రేరణ పొందే కార్యక్రమాలను అమలు చేయడం ‘లక్ష్య’లో భాగమే.