రాష్ట్రంలో ఒకటో తరగతిలో మొత్తంగా 6,09,654 మంది విద్యార్థులుంటే వీరిలో 75% విద్యార్థులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. కేవలం 25% మాత్రమే సర్కారు బడుల్లో చదువుతున్నారు. ఇది విద్యాశాఖ చెబుతున్న లెక్కలు.
Telangana | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : ఒకటో తరగతి వారిప్పుడు రెండో తరగతికి.. ఇలా పైతరగతులకు ప్రమోట్ అవుతారు. ఇదే ట్రెండ్ మరి కొంత కాలం కొనసాగితే సర్కారు స్కూళ్లల్లో విద్యార్థులుంటారా.. ? అంటే కష్టంగానే కనిపిస్తున్నది. ఓ పదేండ్ల తర్వాత సర్కారు స్కూళ్లు కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. 2-10 తరగతుల్లో ప్రైవేట్లో 59% విద్యార్థులుంటే సర్కారు బడుల్లో కేవలం 31శాతమే విద్యార్థులున్నారు. మరో 10% విద్యార్థులు గురుకులాలు, కేజీబీవీల్లో చదువుతున్నారు. ఈ ఉదాహరణలు సర్కారు స్కూళ్ల పరిస్థితికి అద్దంపడుతున్నాయి. భవిష్యత్తును హెచ్చరిస్తున్నాయి. సర్కారు స్కూళ్లపై నమ్మకం తగ్గుతుండటం, ప్రైవేట్పై మోజు పెరుగుతుండటమే ఇందుకు కారణం. టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పడంలేదని, బాధ్యతతో నడుచుకోవడం లేదని సర్కారు నిందిస్తుండగా, టీచర్లేమో స్కూళ్లల్లో వసతుల్లేవు. పర్యవేక్షణలేదంటారు. ఇలా ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ కాలం వెల్లబుచ్చుతున్నారు.