హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఊహించిందే జరుగుతున్నది. ఎన్ఫోర్స్మెంట్(ఈడీ)ని బూచిగా చూపి పలు రాష్ర్టాల ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆయన చెప్తున్న మాటలు అక్షర సత్యమని తేలిపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈడీని బీజేపీ పురమాయించినట్టు బహిర్గతమైంది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చిన ఢిల్లీ బీజేపీ దూతలే స్వయంగా వెల్లడించారు. ఎమ్మెల్యేలతో బేరసారాల సమయంలో కీలక విషయాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో ఈడీ వేట మొదలు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే 34 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల లిస్ట్‌ను ఈడీ సిద్ధం చేసిందని, వీళ్లు తాము చెప్పినట్టు విని బీజేపీలో చేరకపోతే ఈడీ వేట మొదలవుతుందని స్పష్టంచేశారు. ఒప్పుకొంటే నజరానా.. లేకుంటే ఈడీ దాడులేనని తేల్చి చెప్పారు. దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలున్న అన్ని రాష్ర్టాల్లోనూ ఇదే పాలసీని అమలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తమ తదుపరి లక్ష్యం ఢిల్లీ, రాజస్థాన్ అని తెలిపారు.
ఈడీ, సీబీఐలే ప్రధాన అస్ర్తాలు..
ఒక్క ఎమ్మెల్యే సీటు గెలువకపోయినా ప్రభుత్వాన్ని ఏవిధంగా ఏర్పాటు చేయాలన్న అంశంలో బీజేపీ ఆరితేరిపోయిందనే విమర్శలు న్నాయి. ఈడీ, సీబీఐలను పావులుగా వాడుకొని రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నదని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. ఈడీ దాడుల పేరుతో ఎమ్మెల్యేలను భయపెట్టి దారికి తెచ్చుకొంటున్న ఘటనలు అనేక రాష్ర్టాల్లో వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు ఢిల్లీ దూతలు తెలిపారు. ఇందులో భాగంగానే 34 మంది ఎమ్మెల్యేలను ఈడీ దాడుల పేరుతో భయపెట్టి తమ గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించాలని కుట్రలు పన్నినట్టు స్పష్టమవుతున్నది. అయితే, దొంగ స్వాముల బాగోతం బయటపడటంతో విషయం సామాన్యులకు కూడా తెలిసిపోయింది.