Raghava Constructions | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ దుమారం రేపుతున్నది. గోదావరిలో కాటన్ బ్యారేజీ వద్ద పేరుకుపోయిన ఇ సుకను డ్రెడ్జింగ్ ద్వారా తొలగించే రూ.270 కోట్ల విలువైన టెండర్‌ను అడ్డదారిలో దక్కించుకుందని, పనులేవీ చేయకుండానే బిల్లులు స్వాహా చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ధవళేశ్వరం కాటన్ బరాజ్ లోపల రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లకు మధ్య గోదావరిలో చాలా కాలంగా ఇసుక మేటలు పెరిగిపోయాయి. దీంతో డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక మేటలు తొలగించాలని అక్కడి ప్ర భుత్వం నిర్ణయించింది. అందుకు మూడేండ్ల కింద రూ.270 కోట్ల అంచనాతో రాఘవ కన్స్ట్రక్షన్ టెండర్ దక్కించుకున్నది. అయితే అడ్డదారిలోనే ఆ టెండర్ దక్కిందని తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లో 3 కంపెనీలు పోటీపడినా డ్రెడ్జింగ్‌లో ఎలాంటి అనుభవం లేని రాఘవ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడంపై గతంలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. టెండర్‌ను దక్కించుకునేందుకు సదరు కంపెనీ కొందరితో లోపాయికారి ఒప్పందం చేసుకుని, తమకు వ్యతిరేకంగా ఉన్న పలువురు ఇంజినీర్లను అక్కడి నుంచి బ దిలీ చేయించిందని, ఆ తరువాత అనుకూలం గా ఉన్న వారిని నియమించుకుందని సాగునీటి ఇంజినీర్లు, అక్కడి బోట్స్‌మెన్ సొసైటీలు బాహాటంగా ఆరోపిస్తున్నాయి.
టెండర్ దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏపీలో ప్రభుత్వం మారే సమయానికి దాదాపు రూ.50 కోట్ల విలువైన పనులు చేసినట్టు బిల్లులు పెట్టుకుంది. అయితే అక్కడ డ్రెడ్జింగ్ చేసిన సూచనలేమీ లేవని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులే స్వయంగా వెల్లడిస్తున్నారు. డ్రెడ్జింగ్ చేసిన ఇసుక ఏదని అడిగితే పక్కన గుట్టలుగా పోస్తే ఎత్తుకుపోయారని సమాధానం చెబుతున్నదని అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వాకంతో ఉన్నతాధికారులు వరుసగా నోటీసులు సైతం జారీ చేశారు. ఎలాంటి డ్రెడ్జింగ్ చేయలేదని బరాజ్ నిర్వహణ చూస్తేనే తెలిసిపోతున్నదని ఇంజినీర్లు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పొంగులేటి కంపెనీపై విచారణకు సిద్ధమైనట్టు వెల్లడించారు.