Minister Ponguleti | హైదరాబాద్,సెప్టెంబర్28(నమస్తే తెలంగాణ): పొరుగు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఎలక్ట్రిక్ పవర్ పరికరాల డిజైన్, ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఒక లిస్టెడ్ కంపెనీకీ, రాఘవ కన్స్ట్రక్షన్స్కు మధ్య జరిగిన లావాదేవీల మీదనే ఈడీ ఫోకస్ చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ముందుగా లగ్జరీ చేతి గడియారాల స్మగ్లింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టగా, భారీ ఎత్తున ఆర్థిక అక్రమ లావాదేవీలు జరిగినట్టు కూడా చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారని సమాచారం.
పొరుగు రాష్ర్టానికి చెందిన లిస్టెడ్ కంపెనీ, రాఘవ కన్స్ట్రక్షన్స్ కలిసి భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. పొంగులేటి హర్షారెడ్డి 2022 నుంచి లగ్జరీ వాచీల స్మగ్లింగ్ చేస్తున్నారని, ఇప్పటివరకు ఆయన కనీసం 60 నుంచి 70 చేతి గడియారులు విక్రయించి ఉండవచ్చని దర్యాఫ్తు అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది.
విదేశాల్లో ఒక్కొక్క వాచీని రూ.కోటి చొప్పున కొనుగోలు చేసి, ఇండియాలో సంపన్న వర్గాల వారికి రూ.మూడు కోట్ల నుంచి రూ.ఏడు కోట్లకు విక్రయించినట్టు సమాచారం. స్మగ్లింగ్‌కు పాల్పడటం ద్వారా ఎగ్గొట్టిన వ్యాట్, జీఎస్టీ, కస్టమ్స్ ఇతర పన్నుల పన్నుల విలువ ఎంత ఉంటుంది? ఎవరెవరి మధ్య లావాదేవీలు సాగాయి? అనే కోణంలో దర్యాఫ్తు చేయగా, డొంక కదిలినట్టు తెలిసింది.
పొరుగు రాష్ట్రంలో ప్రధాన కేంద్రం కలిగిన సదరు ఎలక్ట్రిక్ కంపెనీకి హైదరాబాద్‌లోనూ కార్యాలయం ఉన్నది. దీనిని 2010లో స్థాపించారు. దీని అధీకృత వాటా మూలధనం రూ.35 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తున్నది. సదరు కంపెనీ ఉన్నట్టు 2019 వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ తరువాత అనూహ్యంగా పుంజుకున్నది. 2023 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.500 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.
ఆ కంపెనీకి, రాఘవ కన్స్ట్రక్షన్స్కు మధ్య 2020 నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతకు, కడప జిల్లాకు చెందిన సదరు కంపెనీ డైరెక్టర్‌కు మధ్య ముందుగా పరిచయం ఏర్పడ్డట్టు తెలిసింది. అక్కడి నుంచి డైరెక్టర్ల పరిచయాలు, ఆర్థిక సర్దుబాటు, ఇచ్చిపుచ్చుకోవడం వరకు సాన్నిహిత్యం పెరిగినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కంపెనీకి అనుబంధ కంపెనీగా ఉన్న సోలార్ ప్లాంటు డైరెక్టర్‌కు నవీన్‌కుమార్ ద్వారా లగ్జరీ వాచీ ఒకటి చేరినట్టు చైన్నె కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాచీకి సంబంధించిన క్రయ, విక్రయాల్లో డబ్బు ఎవరికి, ఎలా చేరింది? అనే అంశంపై లావాదేవీలను పరిశీలించినప్పుడు పెద్ద ఎత్తున మనీలాండరింగ్ అంశం దృష్టికి వచ్చినట్టు సమాచారం. దీంతో కస్టమ్స్ అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు.
అప్పటివరకు కస్టమ్స్ అధికారులు చేసిన దర్యాఫ్తు ఆధారంగా నివేదిక రూపొందించి ఈడీకి సమర్పించారు. పూర్తి స్థాయి వివరాలు రాబట్టడం కోసం ఈడీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను రంగంలోకి దించింది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే రెండు ప్రధాన అంశాలతో ముడిపడి ఉన్న కేసు కాబట్టి సమగ్ర క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ తెప్పించినట్టు తెలిసింది.
2018 వరకు జాతీయంగానే ఎలక్ట్రిక్ పవర్ పరికరాలను విక్రయించే సదరు సంస్థకు ప్రస్తుతం తొమ్మిది దేశాలతో సంబంధం ఉన్నట్టు కస్టమ్స్ దర్యాఫ్తులో తేలింది. ఇందులో లగ్జరీ వాచీలను దిగుమతి చేసినట్టు నిర్ధారించిన హంకాంగ్ దేశంతోపాటు మయన్మార్, యూఎస్ లాంటి దేశాలతో కంపెనీకి సంబంధం ఉన్నట్టు తేలింది. రెండు కంపెనీల మధ్య 33 బోగస్ స్టార్టప్ కంపెనీలున్నాయని గుర్తించినట్టు సమాచారం.
వాటి ద్వారానే పేరు మీద క్రిప్టో టెతర్ కరెన్సీ, క్రిప్టో బిట్‌కాయిన్ రూపంలో లావాదేవీలు జరిగినట్టు తేలిసింది. గత ఏడాది డిసెంబర్లో ఎలక్ట్రిక్ లిస్డెడ్ కంపెనీకి చెందిన కడప, హైదరాబాద్ కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరిగాయి. ఆ తరువాత ఈ ఏడాది మార్చిలో మరోసారి ఐటీ రైడ్స్ జరిగాయి. ఆయా నివేదికలు ఇవ్వాలని ఐటీ అధికారులను ఈడీ కోరినట్టు తెలిసింది. దీని ద్వారా ఈడీకి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.