Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎవరికి టార్గెట్ అయ్యారు? రోజురోజుకు రాష్ట్రంలో కీలక నేతగా ఎదుగుతున్న ఆయన ఎవరికి కంటగింపుగా మారారు? చోటా భాయ్‌కా? లేక బడే భాయ్‌కా? సీనియర్ పెద్దలకా? ఈడీ కొరడావిసరడం వెనుక ఏ రాడార్ పనిచేసింది? గాంధీభవన్ పరిసరాల్లో ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే అంశం మీద చర్చ జరుగుతున్నది. పదేండ్ల స్వల్పకాలంలోనే కీలక ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగిన పొంగులేటి మెల్లమెల్లగా సొంత ఎమ్మెల్యేల బలం పెంచుకుంటున్నారని, కర్ణాటకలో డీకే శివకుమార్ తరహాలో మారుతున్నారని గత ఐదారు నెలలుగా కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇప్పటికిప్పుడు ఆయన బలప్రదర్శన చేస్తే.. 25 మంది ఎమ్మెల్యేలు ఆయన వెనుకే ఉంటారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పుడున్న ముఖ్యనేతలను అధిష్ఠానం పూర్తిస్థాయిలో నమ్మటం లేదట. ఢిల్లీ అవసరాలకు తగ్గట్టుగా కప్పం కట్టలేక ఎప్పుడు కొప్పు ఎత్తేస్తారో అనే అనుమానంతోనే ఉందట. ఆ ముఖ్యనేత వ్యవహారశైలి బడేభాయ్కి కొంత దగ్గరగా మసిలినట్టు ఉండటం, బీజేపీ స్థానిక నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో అంటకాగినట్టు ఉండటం కూడా అధిష్ఠానాన్ని అసౌకర్యానికి గురి చెస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ అంటేనే ముఖ్యమంత్రుల మార్పుకు బ్రాండ్ అంబాసిడర్ పార్టీ. ఎప్పుడు ఎవరని మారుస్తారో తెలియదు. ఈ నేపథ్యంలోనే ఏదైనా జరగరానిది జరిగితే.. పొంగులేటి ముందు వరుసలో ఉంటాడని, లేదంటే మరో ఏక్నాథ్ఫిండేగా మారవచ్చని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళనతో ఉన్నట్టు సమాచారం.
బయటికి రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు కానీ ‘ముఖ్య’నేతతోపాటు సీనియర్ నాయకులు కూడా పొంగులేటి అంటే కంటగింపుగానే ఉన్నారని నాయకుడు ఒకరు చెప్పారు. పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు తీసుకుంది. ఈ పనులకు సంబందించిన బ్యాంకు ష్యూరిటీలను కరేబియన్‌కు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు నుంచి తీసుకొచ్చారు. ఈ ష్యూరిటీని అప్పుడున్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది. ఆ తరువాత వచ్చిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా.. దాన్ని ఆంధ్రాలో టీడీపీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థ హైలైట్ చేసింది.
అది మొదలు వరుసగా లగ్జరీ రిస్టు వాచ్‌లు, హిమాయత్‌సాగర్‌లో ఆయన ఇంటిమీద ఆరోపణలు, ఈడీ దాడుల వ్యవహారాల పరంపర కొనసాగింది. ఇవి ఏవి కూడా పొంగులేటి పార్టీని అడ్డంపెట్టుకొని చెసుకున్న పనులు కావని, అయినప్పటికీ అధిష్ఠానానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని ఆయన వర్గీయులు అంటున్నారు. సొంత పార్టీలోని ‘ముఖ్య’ నేతలే పక్కా పథకంతో ఇరికించారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.