హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 20 నెలలు మాత్రమే గడిచింది. కానీ ఈ కాలంలోనే తీసుకున్న అప్పులు ఎంతో తెలుసా? అక్షరాలా 2.17 లక్షల కోట్లు. మరి.. అప్పుల ద్వారా తెచ్చిన ఈ నిధులను ఏం చేసినట్టు?. గత 20 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క భారీ ప్రాజెక్టును కూడా చేపట్టలేదు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టును నిర్మించింది లేదు, సచివాలయం, కలెక్టరేట్లు వంటి ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కోసం ఒక్క ఇటుక పేర్చింది కూడా లేదు. పోనీ.. దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్న పాపాన కూడా పోలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
చివరికి కాంగ్రెస్ ప్రచారం చేసుకున్న ఆరు గ్యారెంటీలు, 420 హామీలు కూడా అమలు చేయకుండానే రికార్డుస్థాయిలో అప్పులు తెస్తున్నారని మండిపడుతున్నారు. మరి తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికిపోయాయని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు సేకరించిన రుణాల మొత్తం రూ.2.17 లక్షల కోట్లు. అంటే 610 రోజుల్లో చేసిన అప్పు ఇది. ఈ లెక్కన గణిస్తే ప్రభుత్వం రోజుకు రూ.355.73 కోట్ల చొప్పున, గంటకు దాదాపు రూ.15 కోట్ల చొప్పన రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపిందన్నది సుస్పష్టం. ఇవేవో బీఆర్ఎస్ నేతలు చెప్తున్న సొంత లెక్కలు కావు. కాగ్, ఆర్బీఐ చెప్తున్న పక్కా గణాంకాలు. మొదటి 15 నెలల్లో అంటే 2023 డిసెంబర్ నుంచి 2025 మార్చి వరకు రూ.1.66 లక్షల కోట్ల రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎఫ్ఆర్బీఎం రుణాలు రూ.31,900 కోట్లు సమీకరించారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా కార్పొరేషన్ల ద్వారా రూ.18.900 కోట్ల అప్పులు తీసుకున్నారు. ఇలా రేవంత్రెడ్డి ప్రభుత్వం 2025 ఆగస్టు 11 నాటికి దాదాపు 21 నెలల కాలంలో ఎఫ్ఆర్బీఎం, నాన్-ఎఫ్ఆర్బీఎం రుణాలతో కలిపి రూ.2.17 లక్షల కోట్ల భారీ రుణాన్ని సేకరించింది. బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంపై రూ.7 లక్షల అప్పుల భారం మోపిందని, రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రతి సభలోనూ కాంగ్రెస్ నేతలు బూరద జల్లుతూ వచ్చారు. కానీ తాము కేవలం 20 నెలల స్వల్ప వ్యవధిలోనే చేసిన రికార్డు స్థాయి అప్పుల గురించి మాత్రం నోరు విప్పడం లేదు.