KTR | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వే 2024-25 కేసీఆర్ పాలనకు ప్రతీక అని, తెలంగాణ మాడల్ విజయాన్ని ప్రతిబింబిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. ఈ నివేదిక బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన సమగ్ర అభివృద్ధిని, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని సూచిస్తున్నదని పేర్కొన్నారు. సర్వేలోని ప్రధాన అంశాలను కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న అబద్ధాలను సర్వే కొట్టిపారేసింది. తెలంగాణ రాష్ట్రం 88% సొంత పన్ను ఆదాయం (ఎస్వోటీఆర్)లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేసీఆర్ అనుసరించిన ఆర్థిక విధానాలు ఈ విజయాన్ని సాధించాయి.
తెలంగాణలో సాగుకు యోగ్యమైన భూమిలో దాదాపు 90 శాతానికి సాగునీరు అందుబాటులో ఉన్నది. ఇదంతా కేసీఆర్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల వల్లే సాధ్యమైంది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై చేస్తున్న అసత్య ప్రచారాలకు సర్వే తెరదించింది. జలవనరుల్లో ముందంజలో ఉన్నట్టు వెల్లడించింది.
2017లో గ్లోబర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన వీ-హబ్ దేశానికి రోల్మాడల్గా నిలిచింది. దేశంలో మహిళల వ్యాపార ప్రేరణలో కీలకమైన ప్రాతినిధ్యంగా మారింది.
కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది.
తెలంగాణ రాష్ట్రం సేవా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. హైపర్-క్యాపిటా సర్వీస్ జీఎస్వీఏ, జీఎస్వీఏ సేవల్లోనూ బలమైన వాటాను రాష్ట్రం కలిగి ఉన్నది. కేసీఆర్ పాలనను, ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నది. కానీ, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్న రాష్ట్రంగా ఇలాంటి సర్వేలు రుజువు చేస్తూనే ఉన్నాయి’ అని కేటీఆర్ వివరించారు.