హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): ఒకే ఇంటినంబర్‌పై 44 ఓట్లు ఉండటం సహజమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం సోమవారం స్పష్టతను ఇచ్చింది. ఇంటినంబర్ 8-3-231/బీ/118లో 50 మంది ఓటర్లు, 8-3-231/బీ/119లో 10 మంది ఓటర్లు, 8-3-231/బీ/164లో 8 మంది ఓటర్లు, 8-3-231/బీ/160లో 43 మంది ఓటర్లు ఉన్నారనే అంశంపై స్పష్టతనిస్తూ విచారణ చేపట్టినట్టుగా తెలిపింది. ఈ పేర్లు 2023లో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తుది జాబితాలో కూడా ఉన్నాయని వెల్లడించింది. ఆ ఇంటినంబర్లపై కొత్త ఓటర్ల నమోదు జరగలేదనీ, మరింత స్పష్టత కోసం అదొక అపార్ట్మెంట్ అనీ, దీని వలన ఓట్ల సంఖ్య ఎక్కువ వచ్చిందని పేర్కొన్నది. ఇందులో ఇంటినంబర్ 8-3-231/బీ/118లో మూడంతస్థులు+పెంట్ హౌజ్‌తోపాటు, 8-3-231/బీ/160లో 15 ఫ్లాట్లు ఉన్నాయని 2023 నుంచి ఇప్పటివరకు ఓటర్ల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, వీరంతా కొత్తగా నమోదు చేసుకోలేదని జిల్లా ఎన్నికల యంత్రాంగం వివరణ ఇచ్చింది.
బాకా పత్రికల ద్వారా అనుకూల ప్రచారం?
బంజారాహిల్స్, అక్టోబర్ 13: ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌పై భారీగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జాతీయ స్థాయిలో పరువుపోయే పరిస్థితి ఏర్పడటంతో తన బాకా పత్రికలను కాంగ్రెస్ రంగంలోకి దించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ఇండ్లలో కాంగ్రెస్ నేతలు లెక్కకు మించి దొంగ ఓట్లను చేర్చారని బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా బయటపెట్టడంతో దిక్కుతోచని ప్రభుత్వ పెద్దలు.. సొంత పార్టీకి చెందిన పత్రికల ద్వారా అసలేమీ జరగలేదని నమ్మించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి ఇంటినంబర్ 160 పేరుతో ఓటరు జాబితాలో ఉన్న 44 మంది ఓటర్లలో 42 మంది అక్కడ ఎప్పుడూ లేరని తేల్చారు.
అయితే జిల్లా ఎన్నికల అధికారి ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్టు ప్రకారం 2023 డిసెంబర్ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇంటినంబర్ 160 పేరుతో ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. అక్కడున్న నివాసితులకు తెలియకుండానే 42 మంది పేర్లు జాబితాలో ఉన్నాయని తేలినా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా 5 అంతస్థుల భవనంలో 15 ఫ్లాట్లు ఉన్నాయని, దానిలో 44 మంది ఓటర్లు ఉండటం సహజమేనని ప్రకటించడం అనుమానాలకు తావిస్తున్నది. ఎన్నికల అధికారి పెట్టిన పోస్ట్ తర్వాత తెలంగాణలోని ఓ మంత్రికి చెందిన బాకా పత్రిక ద్వారా ‘15 ఫ్లాట్లు, 43 ఓట్లు’ అంటూ ప్రచారం చేయడం గమనార్హం. సదరు అపార్ట్మెంట్లో ఏకంగా 42 దొంగ ఓట్లున్నాయని తేలిన తర్వాత వాటిపై చర్యలు తీసుకోవడం మానేసి అసలేమీ జరగలేదనే ధోరణిలో వార్తలను వండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
విచారణ మరిచి.. క్లీన్చిట్ ఇచ్చే యత్నం!
జూబ్లీహిల్స్ ఓట్ల చోరీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపాల్సి ఉండగా, జిల్లా ఎన్నికల అధికారి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విచారణ దశలోనే క్లీన్చిట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నాడని, అప్పటి నుంచి రెండు ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయిన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. కృష్ణానగర్ బీ బ్లాక్‌లోని ప్లాట్ నంబర్ 160లో గతంలో ఉన్న ఇంటిని పడగొట్టి ఏడాదిన్నన క్రితం కొత్త అపార్ట్మెంట్ వెలిసింది.
దీంతో పాటు ఫ్లాట్ నంబర్ 118లోని ఇల్లు కూడా నవీన్‌యాదవ్ సన్నిహితుడిగా పేరున్న మల్లికార్జున్‌యాదవ్ కుటుంబానికి చెందినవే అని స్థానికులు పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే దొంగ ఓట్ల వ్యవహారం గతంలో కూడా కొనసాగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఓట్ల చోరీ వ్యవహారాలు భారీగా బయటకు వస్తుండటంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లలో బీఆర్ఎస్ నేతలు, ఇన్చార్జులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఇండ్లకు వెళ్లి ఓటర్లను పరిశీలిస్తున్నారు.