కరీంనగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్ టౌన్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. రెండో విడత దళితబంధు కోసం 11 నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్న కొందరు లబ్ధిదారులను ఇప్పటికే 19 సార్లు అరెస్టు చేశారు. మంత్రులు, ప్రభుత్వ ముఖ్యులు, అధికార పార్టీ ప్రముఖులు ఎవరు పర్యటనకు వచ్చినా హుజూరాబాద్ దళితులను ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధిస్తున్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామునుంచే దళితబంధు సాధన సమితి నాయకులు, లబ్ధిదారులను అరెస్టు చేశారు. హుజూరాబాద్‌లో ముగ్గురు, జమ్మికుంటలో ఏడుగురు, ఇల్లందకుంటలో నలుగురు, వీణవంకలో ఒకరిని అదుపులోకి తీసుకుని ఆయా పోలీసుస్టేషన్లకు తరలించారు.
వీరిలో కొందరికి గ్రూప్-3 పరీక్షలు ఉన్నాయని వేడుకున్నా పోలీసులు వదలలేదని వాపోయారు. మంగళవారం వరంగల్, బుధవారం సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభలు ఉండటంతో.. పోలీసులు అదుపులోకి తీసుకున్న దళితులను ఈ సభలు ముగిసే వరకు విడిచిపెట్టే అవకాశం కనిపించడం లేదు. జమ్మికుంట పట్టణంలోని కొలుగూరి సురేశ్ దళితబంధు లబ్ధిదారుడు. అనారోగ్యంతో ఉన్న తన కూతురిని స్థానిక ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా.. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. ‘సార్ పిలుస్తున్నారు’ అని రమ్మని చెప్పగా తన కూతురు జ్వరంతో బాధపడుతున్నదని, డాక్టర్‌కు చూపించిన తర్వాత వస్తానని చెప్పినా పోలీసులు అక్కడే ఉండి నిఘా పెట్టారని సురేశ్ వాపోయాడు. కాగా.. హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దళితబంధు రెండో విడత లబ్ధిదారులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అరెస్టు చేసిన దళితబంధు సాధన సమితి నాయకులు, లబ్ధిదారులను వెంటనే విడిచిపెట్టాలని, లేకుంటే ప్రజలందరితో కలిసి పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖలో ఇటీవల జరిగిన బదిలీల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్‌కు చార్జి మెమో జారీ చేయగా.. తాజాగా మరికొంత మందికి మెమోలు జారీచేసినట్టు వైద్యవర్గాలు తెలిపాయి. దీంతో అక్రమాల పుట్ట పగులుతున్నదని చెప్పుకుంటున్నారు. దీనిని డీపీహెచ్‌కు మాత్రమే పరిమితం చేయొద్దని, డీఎంఈ, ఇతర విభాగాల్లోనూ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జూలైలో చేపట్టిన సాధారణ బదిలీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. ఈ అంశంపై అప్పట్లో వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా వరుసగా అధికారులకు మెమోలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు.. డీఎంఈ పరిధిలో జరిగిన బదిలీల్లోనూ భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.