నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఫిబ్రవరి 20 : యాసంగి పూట యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేమితో సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులు ఉదయాన్నే సొసైటీల వద్దకు పరుగులు తీస్తూ, రోజంతా సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నా బస్తాలు దొరక్క గురువారం పలు జిల్లాలో రైతులు ఆందోళనకు గురయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, ఇదే జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట, నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు, వంగూరు మండలం రంగాపూర్‌లో, నారాయణపేట జిల్లా మక్తల్, నల్లగొండ జిల్లా త్రిపురారంలోని పీఏసీఎస్‌ల వద్ద రైతులు బారులు తీరారు. అయినప్పటికీ యూరియా దొరక్క చాలామంది నిరాశతో వెనుదిరిగారు.