హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దూసుకెళ్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (ఎన్ఎస్డీపీ)లో రాష్ట్రం మూడో స్థానానికి చేరుకున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి స్వయంగా వెల్లడించారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలు, వినియోగ శక్తి పెరుగుదలకు స్పష్టమైన సూచిక. ఈ ఏడాది వ్యక్తిగత ఆదాయం రూ.1,14,710గా నిర్ధారించబడింది నిజమా? రాష్ర్టాలవారీగా వ్యక్తిగత ఆదాయ వివరాలు ఎంత? అని సభ్యులు గిరిధర్యాదవ్, దినేశ్చంద్రయాదవ్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ మంత్రి పంకజ్చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పదేండ్ల క్రితం అన్ని రాష్ర్టాల వ్యక్తిగత ఆదాయం రూ. 65,572గా ఉన్నదని తెలిపారు.
2024-25లో ప్రాథమిక
జీడీపీ అంచనా ప్రకారం 1,14,710గా నిర్ధారించినట్టు వెల్లడించారు. కేంద్ర మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం 2024-25 సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా వ్యక్తిగత ఆదాయంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. కేంద్ర సర్కారు విడుదల చేసిన ప్రాథమిక జీడీపీ అంచనాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం తన వ్యక్తిగత ఆదాయాన్ని 85.3 శాతం పెంచుకున్నది. పదేండ్ల క్రితం రూ. 96,039 ఎన్ఎస్డీపీ ఇప్పుడు రూ.1,87,912 వరకు అంటే 85.3 శాతం ఆదాయాన్ని పెంచుకున్నది. ఇది ఆర్థిక ప్రగతికి కీలకమైన సంకేతంగా భావిస్తున్నారు.
కేసీఆర్ ప్రగతి ప్రస్థానానికి ఇదొక ప్రతీక.
దేశంలోని ఒక రాష్ట్రం ఆర్థిక ఉత్పత్తిని దాని జనాభాతో భాగించినప్పుడు వచ్చేదానిని ఎన్ఎస్డీపీగా పిలుస్తారు. ఇది రాష్ట్రంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని సూచిస్తుంది. అంటే 2013-14 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో 84.3 శాతం వృద్ధి సాధించింది. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో 3వ స్థానంలో నిలిచిందని ఆర్థిక మంత్రి తెలిపారు. తెలంగాణ ఈ వృద్ధి సాధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రధాన కారణాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయంలో ఆర్థిక మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, పౌరసేవలు మెరుగుపరచడంలో ప్రత్యేక కృషి చేసింది.
ముఖ్యంగా రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు ఈ విజయానికి సహకరించాయి. ఐటీ, ఇండస్ట్రీ పాలసీలు, గ్రామీణ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి అనేక కార్యక్రమాల వల్లే ఈ ఆర్థిక స్థిరత్వం సాధ్యమైంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ విజనరీ పాలనకు నిదర్శనం. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి ఇది మచ్చుతునక.