Rythu Bandhu | చిలుకూరు, డిసెంబర్ 22: రైతుబంధు పంపిణీ విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. రూపాయి, రెండు రూపాయిలు తమ ఖాతాల్లో జమైనట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కందుల శ్రీనుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనకు 32 గుంటల పొలం ఉన్నదని, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తనకు రూ.4 వేల చొప్పున జమ అయ్యేదని, ఈసారి రూ.2 మాత్రమే జమైనట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని కందుల శ్రీను ఆందోళన వ్యక్తంచేశాడు. సంబంధిత అధికారులు స్పందించి తన ఖాతాలో పూర్తిస్థాయిలో రైతుబంధు నగదు జమ అయ్యేలా చూడాలని కోరుతున్నాడు. వాస్తవానికి అందాల్సిన పెట్టుబడి సాయం కంటే చాలా తక్కువ మొత్తంలో పలువురు రైతుల ఖాతాల్లో జమవతున్న విషయాన్ని ఇప్పటికే మీడియా రిపోర్ట్ చేసినప్పటికీ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం.