హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరమని ఫిషరీస్ ఫెడరేషన్, కల్లుగీత, గొర్రెలు-మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ల చైర్మన్లు పిట్టల రవీందర్ ముదిరాజ్, పల్లె రవికుమార్‌గౌడ్, డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లా డుతూ.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కోసం అన్నివర్గాల ప్రజల మద్దతును కూడగట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని వివరించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమున్నదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాల ఫలితంగా అన్నిరంగాల్లో వచ్చిన గుణాత్మక మార్పును, సర్వతోముఖాభివృద్ధిని ప్రజలు తమ అనుభవంలో గమనిస్తున్నారని పేర్కొన్నారు.