శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:22:00

దుబ్బాక.. గులాబీ అడ్డా

దుబ్బాక.. గులాబీ అడ్డా

  • ఐదు ఎన్నికల్లో నాలుగుసార్లు  విజయఢంకా
  • మరోసారి ఘనవిజయంపై  టీఆర్‌ఎస్‌ శ్రేణుల ధీమా 
  • ప్రతి ఎన్నికల్లోనూ  50 శాతానికిపైగా ఓట్లు
  • డిపాజిట్‌కూ ముఖంవాచిన కమలనాథులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దుబ్బాక నియోజకవర్గం గులాబీ జెండాకు అడ్డాగా నిలుస్తున్నది. టీఆర్‌ఎస్‌ను స్థాపించిన నాటినుంచి కారు గుర్తుకు ఓటేస్తూ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు. 2004 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఎన్నికలు జరుగగా.. నాలుగుసార్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. ఆయన గెలిచిన ప్రతిసారి యాభైశాతానికిపైగా ఓట్లు పొందారు. 2004, 2008 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు టీడీపీ ప్రత్యర్థిగా ఉండగా.. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నిలిచింది. ముందుగా దొమ్మాట నియోజకవర్గంగా ఉండగా.. 2009లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత దుబ్బాకగా మారింది. పూర్తి గ్రామీణ నేపథ్యంఉన్న ఈ నియోజకవర్గం అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలకు సాక్ష్యంగా నిలిచింది. తమతోపాటు అనేక పోరాటాల్లో పాల్గొన్న సోలిపేట రామలింగారెడ్డిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా రామలింగారెడ్డి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేశారు. రామలింగారెడ్డి మరణంతో జరుగుతున్న ఉపఎన్నికల్లోనూ గులాబీ గుబాళింపు ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలు ఎప్పటిలాగే టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటారని ఎన్నికల ప్రచారంలోనే స్పష్టమైందని పార్టీ నాయకులు చెప్తున్నారు.

రఘునందన్‌ అభ్యర్థిత్వాన్ని రద్దుచేయాలి: శశిధర్‌రెడ్డి

దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ తరఫున పోటీచేస్తున్న రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని రద్దుచేయాలని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ సోమవారం లేఖ రాసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని, రెండుసార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడిందని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. వెంటనే రఘునందన్‌ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. 


ఓడిపోవడం..  రఘునందన్‌కు అనవాయితీ 

ఎన్నికల్లో ఓటమి రఘనందన్‌రావుకు అనవాయితీగా వస్తున్నది. గతంలో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిన రఘునందన్‌.. బీజేపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీచేసి డిపాజిట్‌ దక్కించుకోలేకపోయారు. దుబ్బాక చరిత్రలో బీజేపీ ఏనాడూ 25 వేల ఓట్లు దాటిందిలేదు. 2004, 2008 ఎన్నికల్లో  పోటీచేయని బీజేపీ.. 2009లో తొలిసారి పోటీచేసి కేవలం 5,967 ఓట్లు సాధించి నాలుగో స్థానానికి పరిమితమయింది. 2014, 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ రఘనందన్‌రావు పోటీచేసి ఓటమిచెందారు. ఎమ్మెల్యేగా పోటీచేసి 2014లో 15వేలు, 2018లో 22 వేల ఓట్లు సాధించారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మెదక్‌ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ సెంగ్మెంట్‌ నుంచి బీజేపీకి 29వేల ఓట్లురాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి 82 వేలు దక్కించుకున్నారు. దుబ్బాకలో పోటీచేసిన ప్రతిసారి రఘనందన్‌రావుకు డిపాజిట్‌ కూడా దక్కలేదు.