Kotha Prabhakar Reddy | యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యూరియా యాప్‌తో రైతులు ఆగమాగం అవుతున్నారని పేర్కొన్నారు. యాప్ లేకుండా యూరియా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని 8 మండలాల్లో రెట్టింపు వరి సాగు చేశారని తెలిపారు. యూరియా వస్తుందో లేదననే ఆందోళనలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు. యాప్ ద్వారా యూరియా విషయంలో రైతులు ఆగమాగం అవుతున్నారని చెప్పారు. గ్రామాల్లో కరెంటు సరఫరా సక్రమంగా కావడం లేదని తెలిపారు. కూడవెల్లివాగు కాల్వలు పూడిక తీయకపోవడంతో నీళ్లు వచ్చే పరిస్థితి లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాల్వలు కూడా పూడుకుపోయాయని పేర్కొన్నారు. వాడి పూడిక తీయకపోవడంతో కాల్వల మీధ ఆధారపడ్డ రైతులు నష్టపోతున్నారని అన్నారు.
ఇరిగేషన్‌పై సంబంధిత మంత్రి ఏనాడూ రివ్యూ పెట్టింది లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. రైతుల వద్ద ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవడం లేదని తెలిపారు. నియోజకవర్గంలోని 8 మండలాల రైతులను ఆదుకోవాలని కోరారు.