హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : అక్కడ కుక్క మృతి చెందినా కూడా పోస్టుమార్టం చేయించారు. కానీ ఒక విద్యార్థి చనిపోతే పోస్టుమార్టం చేయించలేదు. ఇదీ హైదరాబాద్ ఉత్తర శివారులోని ఓ యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహారించిన తీరు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. కానీ విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతికి కారణాలను వెలికితీయాలని విద్యార్థి సంఘాల్లో డిమాండ్ వినిపిస్తున్నది. ఇదే సమయంలో విద్యార్థులను చల్లబర్చేందుకు వర్సిటీ యాజమాన్యం 15 రోజులు సెలవులు ప్రకటించింది. నిర్ణీత సమయానికి పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైతే సిలబస్ కూడా తగ్గిస్తామని సర్క్యూలర్ ద్వారా తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో వర్సిటీలో అసలేం జరుగుతున్నదని విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ శివారులోని ఓ వర్సిటీలో 10 రోజుల క్రితం ఎల్ఎల్బీ ఐదో సంవత్సరం విద్యార్థి తన గదిలో అపస్మారక స్థితిలోకి వెళ్లాడంటూ అక్కడే ఉన్న స్నేహితులు అతడిని వర్సిటీలోని వైద్యశాలకు తరలించారు. దవాఖానలో ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడం, డ్యూటీ డాక్టర్ వేగంగా స్పందించకపోవడంతో, బయట ప్రైవేట్ దవాఖానకు తరలించారని తెలిసింది. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని సమాచారం. గొంతులో కుర్కురే ఇరుక్కోవడంతో ఊపిరాడక విద్యార్థి చనిపోయాడని కొందరు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి మృతిపై యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. గుండెపోటుతోనే విద్యార్థి చనిపోయాడని పేర్కొంది. కానీ ఇదంతా నమ్మశక్యంగా లేదని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి గదిలో ఆ రోజు ఏం జరిగిందనే విషయంలోనూ స్పష్టత లేదని, ఆ గదిలో ఆధారాలను కొందరు చెరిపివేశారని చెప్తున్నారు. పోలీసులు నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ విశ్వవిద్యాలయ యాజమాన్యం అనుమతి లేకుండా తాము లోపలికి వెళ్లలేమని, మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రాలేదని పోలీసులు అంటున్నారు. విద్యార్థి మృతి చెందిన ఘటనకు ముందురోజే మరో విద్యార్థి కూడా ఆత్మహత్యాయత్నం చేయగా.. వర్సిటీలోని దవాఖానలో వైద్యులు చికిత్స అందించి, ప్రాణాపాయం నుంచి కాపాడినట్టు మరికొందరు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి కడుపులో మద్యం ఆనవాళ్లు కూడా గుర్తించినట్టు సమాచారం. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే మరో విద్యార్థి మృతి చెందడం పట్ల వర్సిటీలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
యూనివర్సిటీ లోపల బహిరంగ ప్రదేశాలలో సీసీ కెమెరాలు కూడా లేవని తెలుస్తున్నది. కెమెరాలు పెట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్న ప్రతీసారి తమ ప్రైవసీకి భంగం కలుగుతుందంటూ కొందరు విద్యార్థులు, అధ్యాపకులు అభ్యంతం చెప్తుంటారని సమాచారం. విద్యార్థులకు నచ్చజెప్పి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం యాజమాన్యానికి పెద్ద సవాల్‌గా మారిందని వర్సిటీలో చర్చ జరుగుతున్నది. గతంలో 2017లో ఇదే యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ధూల్‌పేట నుంచి గంజాయి కొనుక్కుని యూనివర్సిటీకి వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వాళ్ల వద్ద 450 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ విద్యార్థులపై వర్సిటీ యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది.
నగర శివారులలోని యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు డ్రగ్స్, మద్యంతో పట్టుబడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ ముఠాలు విద్యార్థులపై కన్నేస్తూ వారిని చెడు అలవాట్లకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఈగల్ దాడుల్లో బయటపడుతున్నది. ఇటీవల విద్యార్థి మృతిచెందిన యూనివర్సిటీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర దేశాల విద్యార్థులు కూడా చదువుకోవడానికి వస్తుంటారు. వీరిలో కొందరు విద్యార్థులు.. ఇతర విద్యార్థులను చెడు మార్గంలోకి లాగుతున్నారని, పలు సందర్భాల్లో దొరికిపోతున్నారని తెలిసింది. కానీ విషయాలు బయటపడితే వర్సిటీ పేరు బద్నాం అవుతుందనే కారణంతో అధికారులు కప్పిపుచ్చుతున్నారని సమాచారం. మరోవైపు ఇటీవల ఓ ప్రైవేట్ వర్సిటీలో విద్యార్థులు డ్రగ్స్ కేసులో ఈగల్ బృందాలకు పట్టుబడ్డారు. దీంతో ఈగల్ అధికారులు పలు ప్రైవేట్ వర్సిటీల్లో తనిఖీలు చేశారు. ఈ విషయం విద్యార్థుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తున్నది.
నాలుగు నెలల క్రితం ఇదే యూనివర్సిటీలో ఒక కుక్క మృతి చెందింది. కుక్కపై విషప్రయోగం జరిగి ఉంటుందని, పోస్టుమార్టం నిర్వహించి, కుక్క మృతికి కారణాలను తెలుసుకోవాలని కొందరు విద్యార్థులు పట్టుబట్టారు. విద్యార్థుల డిమాండ్‌తో వర్సిటీ మేనేజ్మెంట్ అధికారులు కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుక్కకు విషప్రయోగం జరగలేదని, సాధారణ మరణమేనని వైద్యులు తేల్చారు. కుక్కకు పోస్ట్‌మార్టం నిర్వహించిన వర్సిటీలో విద్యార్థి మృతి చెందితే అనుమానాలను ఎందుకు నివృత్తి చేయడంలేదని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? వర్సిటీ యాజమాన్యాల ఒత్తిడి ఏమైనా ఉందా? అంటూ వ్యక్తమవుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు.