గురుకులాల్లోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను సర్కారు కుదించింది. జేఎల్‌కు 35 వేల నుంచి 23,400కు, పీజీటీలకు 31,395 నుంచి 18,200కు, టీజీటీలకు 28,660 నుంచి 18,200కు తగ్గించింది. టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించింది.
Telangana | గురుకులాల్లోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ కత్తి దూసింది. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారికి చెల్లించే వేతనాల్లో కోత విధించింది. ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్నవారి కంటే తక్కువ స్థాయికి పాఠాలు బోధించే టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు) వేతనాలను కుదించింది. ఈ మేరకు వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ చర్యలపై గురుకులాల్లోని ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ నిప్పులు చెరుగుతున్నారు.
తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీలో 204 గురుకులాలు ఉన్నాయి. వాటిలో రెగ్యులర్ సిబ్బంది కాకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 3,756 మందిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అందులో టీచింగ్ విభాగంలో ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), టీజీటీ, పీజీటీ పోస్టులున్నాయి.
నాన్‌టీచింగ్ విభాగంలో డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులున్నారు. గతంలో జేఎల్‌కు రూ.35 వేలు, పీజీటీ, టీజీటీలకు రూ.27వేల వేతనం చెల్లించేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి సైతం రెగ్యులర్ సిబ్బందికి చెల్లించిన తరహలో 30% పీఆర్సీని వర్తింపజేసింది. క్రమం తప్పకుండా కంటిన్యుయేషన్ ఆర్డర్స్ ఇస్తూ వచ్చింది.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది కొనసాగింపునకు సంబంధించి ఆర్డర్స్‌ను గత రెండు నెలలుగా ఇవ్వలేదు. దీంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేతనాలను విడుదల చేయలేదు. దీంతో సొసైటీలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు.. ‘బతికెదెట్లా?’ అంటూ ఇటీవల ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా సొసైటీలోని సిబ్బంది వేతనాల్లో కోత విధించింది.
గత ఏప్రిల్ నుంచి 2026 మార్చి 21 వరకు ఉపాధ్యాయులను, అధ్యాపకులను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తాజాగా 16న జీవో ఆర్టీ నంబర్ 1437 పేరుతో ఉత్తర్వులు జారీచేసింది. అయితే అదే ఉత్తర్వుల్లో వేతనాల విషయంలో మాత్రం భారీ కోతలు పెట్టింది. జేఎల్ వేతనాన్ని రూ.35 వేల నుంచి రూ.23,400కు కుదించింది. ఒక్కసారిగా ఏకంగా రూ.11,600 వేతనాన్ని కోసేసింది.
పీజీటీల వేతనాన్ని రూ.31,395 నుంచి రూ.18,200కు, టీజీటీల వేతనాన్ని రూ.28,660 నుంచి రూ.18,200కు తగ్గించింది. మొత్తంగా 1,227 జేఎల్, 435 పీజీటీ, 108 టీజీటీల వేతనాన్ని కోసేసింది. అదేవిధంగా ఔట్సోర్సింగ్ విభాగంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కుక్‌లు, కంప్యూటర్ టీచర్లు, పీడీలు, పీఈటీలు, తదితర సిబ్బంది వేతనాలను సైతం భారీగా తగ్గించింది.
ఒక్కో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగికి సగటును రూ.5వేల నుంచి రూ.13వేల వరకు కోత విధించింది. ఉన్నతాధికారుల వద్ద, కార్యాలయంలో పనిచేసే డ్రైవర్ల వేతనం 19,500 కాగా, విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్న టీజీటీ, పీజీటీల వేతనాన్ని రూ.18,200గా నిర్ధారించారు. ప్రభుత్వం నిర్ణయంపై ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం తీరుపై ఇదేనా ప్రజాపాలన? అంటూ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం మైనార్టీ గురుకులాలపై ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇతర గురుకులాలతో పోలిస్తే మైనార్టీ గురుకులాల్లో పనిచేసే జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు వేతనాలు అదనంగా ఉండటం వల్ల సదరు సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో పనిచేస్తూ విద్యార్థులకు బోధన అందించారు.
కానీ, సర్కారు తాజా నిర్ణయం వల్ల తగినంత వేతనాలు అందే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో బోధన విషయంలో అంకితభావం కొరపడుతుందని, తద్వారా ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళన బాట పట్డేందుకు సదరు అధ్యాపకులు, ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు.
మైనార్టీ గురుకుల సొసైటీలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి సంబంధించి రెండు నెలల వేతన బకాయిలను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వేతనాల కోసం వారు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. వేతనాలను విడుదల చేసింది. అయితే గతం కంటే భారీగా వేతనాల్లో కోత విధించింది.
మైనార్టీ గురుకులాల్లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోత విషయం తనకేమీ తెలియదని సొసైటీ సెక్రటరీ షఫియుల్లా జావాబిస్తుండటం గమనార్హం. వేతనాల కోత నేపథ్యంలో గురుకుల సిబ్బందితో జూమ్ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. ఈ సమావేశంలో సెక్రటరీ షఫియుల్లా స్పందిస్తూ.. వేతనాల్లో కోత విషయం తన దృష్టికే రాలేదని చెప్పినట్టు సొసైటీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ప్రస్తుత ఉత్తర్వులను సవరిస్తారనే భరోసా కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సెక్రటరీకి తెలియకుండా ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఎలా వెళ్లాయని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిదే సొసైటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో మైనార్టీతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు సైతం ఉన్నాయి. ఇతర గురుకులాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న జేఎల్‌కు రూ.27వేలు, టీజీటీ, పీజీటీలకు రూ.24వేలు, పీడీలకు, ఆర్ట్, మ్యూజిక్ టీచర్లకు రూ.20వేల చొప్పున చెల్లిస్తున్నారు. మైనార్టీ గురుకుల సొసైటీ తరహాలోనే తమకు సైతం వేతనాలు ఇవ్వాలని మిగతా సొసైటీల్లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎన్నికల ముందు గాంధీభవన్‌కు వెళ్లి ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సైతం వినతిపత్రం అందజేశారు. ప్రజాపాలనలో న్యాయం చేస్తామని, 12 నెలలకు మినిమం టైమ్సేల్ను ఇస్తామని, జాబ్ సెక్యూరిటీ కల్పిస్తామని, జేఎల్‌కు రూ.42 వేల జీతం చెల్లిస్తామని హామీ ఇవ్వడమేకాదు, ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పొందుపరిచింది.
కానీ ఆ హామీ సంగతేమో కానీ మైనార్టీ గురుకులాల్లోని నాన్‌రెగ్యులర్ ఉద్యోగుల వేతనాల్లోనే కోత విధించడం గమనార్హం. గత ప్రభుత్వం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను పెంచుతూ రావడమేగాక, పీఆర్సీనీ సైతం వర్తింపజేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందించే అత్తెసరు వేతనాల్లోనే భారీగా కోత విధించింది. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నది. ఇప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను జీవో-1284 పేరిట రోడ్డున పడేసింది.