Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగడంతో 19 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగి మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇవ్వకుండా, అక్కడి నుంచి పారిపోవడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అంటున్నారు.
కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ట్రావెల్స్ బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌ను బస్సు బలంగా ఢీకొన్న తర్వాత బైకర్ కిందపడిపోయాడు. అయినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు వెళ్లడంతో బైక్ బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్‌లోని పెట్రోల్ లీకవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ముందు భాగంలో మంటలు అంటుకోవడంతో పక్కకు ఆపిన డ్రైవర్, వాటిని ఆర్పేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేసిన డ్రైవర్, ఫైర్ సేఫ్టీ సిలిండర్‌తో కాకుండా సాధారణ వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పేందుకు యత్నించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో భయపడిన డ్రైవర్.. వెంటనే తోటి డ్రైవర్‌ను లేపాడు. ఇద్దరు కలిసి ప్రయాణికులను అప్రమత్తం చేయాల్సింది పోయి.. అక్కడి నుంచి పారిపోయారు.
పారిపోయేటప్పుడు కనీసం బస్సు డోర్లు కూడా తెరవలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో హైడ్రాలిక్ కేబుల్స్ తెగి పోవడంతో డోర్ తెరుచుకోలేక చాలామంది బస్సులో నుంచి బయటకు రాలేకపోయారని తెలిపారు. కొంతమంది మాత్రం అద్దాలు పగులకొట్టుకుని బయటకు దూకేశారని పేర్కొన్నారు. అదే బస్సు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి ఉంటే 80 శాతం వరకు ప్రాణ నష్టం తగ్గి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.