Mission Bhagiratha Water | కామారెడ్డి/బాన్సువాడ, మార్చి 20: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాగునీటి సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం పల్లెలు, తండాలు తల్లడిల్లుతున్నాయి. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండటంతో జనం గొంతెడుతున్నది. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోవడం, మోటర్లు మొరాయిస్తుండటంతో తాగునీటి కటకట ఏర్పడుతున్నది. మంచినీటి కోసం మహిళలు బిందెలతో పొలాల్లోని బోర్ల వద్దకు పరుగులు తీస్తున్న దృశ్యాలు పదేండ్ల తర్వాత మళ్లీ కనిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, పెద్దకొడప్గల్, పిట్లం, జుక్కల్, గాంధారి, లింగంపేట, కామారెడ్డి, మాచారెడ్డి తదితర మండలాల్లో తాగునీటి సమస్యలు తీవ్రమయ్యాయి.
పెద్ద కొడప్గల్ మండలం పోచారం తండా, కుబ్యానాయక్ తండా, విట్టల్ వాడి తండా, మన్సారం తండా వాసులు తాగునీటి కోసం కిలోమీటర్ దూరం నడవాల్సిన దుస్థితి నెలకొన్నది. బాన్సువాడ మండలం కాద్లాపూర్లో ఉదయం కొద్దిసేపు మాత్రమే వస్తున్న భగీరథ నీరు ఏ మాత్రం సరిపోక పంటపొలాల్లో బోర్ల నుంచి బిందెల ద్వారా తెచ్చుకుంటున్నారు. అవాజ్పల్లి తండాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. పెద్ద కొడప్గల్ మండలం మన్సారం తండాలో మిషన్ భగీరథ నీరు సరిగా రావట్లేదు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో తాగునీటి కటకట నెలకొన్నది. ఇక్కడ 250 కుటుంబాలు ఉంటే మూడు బోర్లే ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో అవి కూడా సరిగా పోయడం లేదు. పైపులు చెడిపోవడంతో మిషన్ భగీరథ నీళ్లు రావడం