మళ్లీ కన్నీటి కష్టాలు.. సమైక్య పాలన నాటి దృశ్యాలు
ప్రమాదకర బావిలో దిగి నీటిని తోడుకోవడం.. కిలోమీటర్ల కొలదీ నడిచి వ్యవసాయ బోర్లు.. బావుల నుంచి నీటిని తెచ్చుకోవడం.. సమస్య తీవ్రమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం.. ఇవన్నీ రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ పల్లెల్లో కనిపించిన దృశ్యాలు. ఇప్పుడు నారాయణఖేడ్ నియోజకవర్గంలో అవే దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి.
- నారాయణఖేడ్ నియోజకవర్గంలో తీవ్రమవుతున్న తాగునీటి సమస్య
- మిషన్ భగీరథకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు
- వ్యవసాయ బోర్ల వద్దకు జనం పరుగులు
- రోడ్లెక్కి నిరసనలకు దిగుతున్న వైనం
- కేసీఆర్ పాలనే నయమంటున్న ప్రజలు
ప్రమాదకర బావిలో దిగి నీటిని తోడుకోవడం.. కిలోమీటర్ల కొలదీ నడిచి వ్యవసాయ బోర్లు.. బావుల నుంచి నీటిని తెచ్చుకోవడం.. సమస్య తీవ్రమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం.. ఇవన్నీ రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ పల్లెల్లో కనిపించిన దృశ్యాలు. ఇప్పుడు నారాయణఖేడ్ నియోజకవర్గంలో అవే దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పథకం పుణ్యమా పూర్తిగా సమసిపోయిన ఆ క‘న్నీటి’ కష్టాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలను మళ్లీ వెంటాడుతున్నాయి. మిషన్ భగీరథ పథకం సక్రమంగా అమలుకాక నీటి కోసం పరుగులు పెట్టాల్సిన దుస్థితి దాపురించడంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
నారాయణఖేడ్, ఏప్రిల్ 19 : రాష్ట్ర విభజనకు ముందు నిత్యం నీటి సమస్యతో సతమతమైన నారాయణఖేడ్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ పథకం వరప్రదాయినిగా మారింది. స్వరాష్ట్రం ఏర్పడి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నాటి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి నారాయణఖేడ్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా నిర్మూలించారు. రూ.400 కోట్లతో ఈ పథకాన్ని చేపట్టి పట్టణాలు మొదలుకొని మారుమూల తండాల వరకు నల్లాల ద్వారా ఇంటింటికీ మంచినీరు సరఫరా చేశారు. దీంతో ఏదైనా పెద్ద సమస్య వస్తే తప్ప వరుసగా రెండు, మూడు రోజులు నీటి సరఫరా నిలిచిపోయిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమర్థంగా అమలైన మిషన్ భగీరథ పథకం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చిన్నబోయింది. నారయణఖేడ్ నియోజకవర్గంలో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడం, మోటర్లు మొరాయించడం, విద్యుత్తు సరఫరాలో సమస్యలు, పైప్లైన్ లీకేజీలు తదితర కారణాలతో ఇప్పుడు రోజుల తరబడి నీటి సరఫరా నిలిచిపోవడం పరిపాటిగా మారింది. దీంతో ప్రజలు నీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. శుభకార్యాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. నారాయణ్ఖేడ్తోపాటు నాగల్గిద్ద, కంగ్టి, సిర్గాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వేసవి ఆరంభానికి ముందే ‘మిషన్ భగీరథ’ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన అధికారులు తీరా ఇప్పుడు పైప్లైన్ లీకేజీలను సరిచేస్తున్నామని ఓసారి, మోటర్ల సమస్య అని మరోసారి, ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయిన కారణంగా నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని ఇంకోసారి పొంతనలేని కారణాలు చెప్తున్నారు.
రోడ్డెక్కిన జీవులా తండావాసులు
సిర్గాపూర్ మండలం జీవులా తండాలో వారం రోజులు నీటి సరఫరా నిలిచిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నారాయణఖేడ్-సిర్గాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నీటి కోసం ప్రతిరోజూ నానా అవస్థలు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కరోజు కూడా మంచినీటి సమస్య రాలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తరచూ నీటి సరఫరా నిలిపివేసి ఇబ్బందులు కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో ఎంపీవో బ్రహ్మంచారి అక్కడికి చేరుకుని ప్రజలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అప్పటికప్పుడు ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించినప్పటికీ తమకు మిషన్ భగీరథ నీటినే సరఫరా చేయాలని తండావాసులు మాత్రం పట్టుబట్టడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.
నీటి తిప్పలు భరించలేకే ధర్నా
మా తండాకు వారం రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులను సంప్రదించినా రేపు మాపు అని సమాధానం ఇవ్వడమే తప్ప సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. మా తండాకు దగ్గరలో ఎక్కడా బోరు కూడా లేకపోవడంతో చాలా దూరంలోని వ్యవసాయ బోరు మోటర్ నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. నీటి కోసం రోజూ తిప్పలు పడలేకే మేము ఆందోళనకు దిగినం. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇంత దారుణంగా నీటి సమస్య రాలేదు. ఏదైనా సమస్య వచ్చినా ఒకట్రెండు రోజుల్లోనే నీటి సరఫరా పునరుద్ధరించేవారు.
– సుభాష్, జీవులా తండా, సిర్గాపూర్ మండలం
కేసీఆర్పై కక్షతోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రమవుతున్నది. కేసీఆర్పై కక్షతో రేవంత్రెడ్డి సర్కార్ ఉద్దేశపూర్వకంగానే మిషన్ భగీరథ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. సంబంధం లేని కారణాలు చూపుతూ నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా అడుగంటిన సందర్భాల్లోనూ మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేసింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 9 టీఎంసీల జలాలు ఉన్నప్పటికి నీటి మట్టం తగ్గిందంటూ మిషన్ భగీరథ నీటిని నిలిపివేయడం వెనుక కుట్ర ఉన్నది.
– మహారెడ్డి భూపాల్రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

