నాడు తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ ‘ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్తున్నా.. తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా’ అని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సాధించి చూపారు. మరి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి కనీసం బీసీలకు రిజర్వేషనైనా సాధించారా?
-కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఏం సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయినాక బీసీ రిజర్వేషన్ల ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని విమర్శించారు. మరి బీసీ డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యాక బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పిందా? అని నిలదీశారు. నాడు తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ ‘ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్తున్నా.. తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా’ అని చెప్పారని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి చూపించారని గుర్తుచేశారు. మరి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి బీసీల రిజర్వేషన్ సాధించించారా? లేదా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీ సబ్‌ప్లాన్, బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో ఉన్నావని పార్టీ మారిన ఎమ్మెల్యేను ఓ విలేకరి అడుగ్గా, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కాలె యాదయ్య ఏ పార్టీలో ఉన్నారో శోధించి, పరిశోధించి స్పీకర్ చెప్తానడం దారుణమని పేర్కొన్నారు.
ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, ఎంత అద్భుతంగా పనిచేయవచ్చో దేశానికి చూపెట్టింది తమ పార్టీ అధినేత కేసీఆర్ అని కేటీఆర్ చెప్పారు. కానీ, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో, ఎలాంటి మాటలు మాట్లాడకూడదో, ఎలాంటి పనులు చేయవద్దో చూపెడుతున్నది రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి జడ్పీటీసీ కాకముందే సబితాఇంద్రారెడ్డి మంత్రిగా పనిచేశారని, నిన్న ఆమె నియోజకవర్గంలోనే ఆమెను అవమానించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓడిపోయిన అభ్యర్థిని వేదికపైన కూర్చోబెట్టి ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని, దీనిపై నిలదీసిన కార్యకర్తలు మాజీ మంత్రిపై పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించారని విమర్శించారు. “పరిగి మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఒక్కటే గుర్తుపెట్టుకొమ్మని చెప్తున్న. ఐఏఎస్ అధికారులు కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నరు. ఇటీవల ఖైరతాబాద్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చిలుకపలుకులు పలుకుతున్నరు. పదేండ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నరు. వాళ్లందరికీ ఒక్కటే చెప్తున్న. ఎక్కువ టైమ్ లేదు. రెండు రెండున్నరేండ్లలో మళ్లీ మేమే వస్తున్నం. ఇప్పుడు ఎవరెవరైతే ఎగిరెగిరి పడుతున్నరో. ఎవరైతే అతి చేస్తున్నరో, ఎవరైతే రేవంత్ కంటే ఎక్కువ చేస్తున్నరో.. వారిందరి పేర్లు రాసి పెట్టుకుంటం. ప్రతిఒక్కరి మాటలు యాదిపెట్టుకుంటం. ఇదివరకు లెక్క ఉండం. అన్నీ ఇసాబ్.. కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది” అని హెచ్చరించారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో పదేండ్లు పూర్తిగా ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టామని కేటీఆర్ చెప్పారు. ఇకపై అలా కాకుండా ప్రభుత్వంతోపాటు పార్టీకి కూడా సమయం కేటాయిస్తామని తెలిపారు. ‘1978 నుంచి కాంగ్రెసోళ్లు తాండాలను పంచాయతీలు చేస్తామని చెప్పి చేయలేదు. కానీ కేసీఆర్ హ యాంలో తండాలు, పలెల్లు పంచాయతీలు అయ్యాయి. కొత్త గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ వికారాబాద్‌లో కూడా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మన కలెక్టరేట్లను ప్రశంసించారు. ఇత రాష్ట్రాల్లోని సెక్రటేరియట్లు కూడా తెలంగాణలోని కలెక్టరేట్ల మాదిరి లేవన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో కేసీఆర్ జమ చేశారు’ అని కేటీఆర్ వివరించారు.
కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎగిరెగిరి పడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల్లా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మరో రెండేండ్లలో మళ్లీ అధికారంలోకి వస్తాం. అప్పుడు అందరి లెకలు సరిచేస్తాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నావని పార్టీ మారిన ఎమ్మెల్యేను ఓ విలేకరి అడిగితే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నానని చెప్పడం సిగ్గుచేటు.
చేసిన మంచి పనులను ప్రజలకు వివరించడంలో మ నం ఫెయిలయ్యామని, పదేండ్లలో సాధించిన ప్రగతిని చెప్పుకోలేక పోయమని కేటీఆర్ అన్నారు. ‘అవతలోడు వచ్చి ఆశ చూపెట్టి గెలిచిండు. గెలిచాక ఏం చేస్తలేడు. కాంగ్రెస్‌ను నమ్మి ఇవాళ బాధపడుతున్నారు. కార్యకర్తల్లాగా మనం చేయాల్సిన పని ఒకటే. కేసీఆర్‌కు సీఎం కొత్త పదవి కాదు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్లీ 15 ఏండ్లు వెనకి పోయే ప్రమాదం ఉన్నది. అందుకే తెలంగాణను మళ్లీ పట్టాలెకించాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి. కార్యకర్తలందరం కలిసి పనిచేద్దాం. 20 నెలల కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు తగ్గాయి. రేవంత్ వచ్చిన తర్వాత రైతుబంధు నాట్లు వేసేటప్పుడు కాకుండా ఓట్లే వేసే టప్పుడు వేస్తున్నరు. కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రామ్రామ్ చెప్తరు అని కేసీఆర్ అన్నట్టుగా, ఈ ఒక్క ఎలక్షన్ దాటిన తర్వాత రైతుబంధును బంద్ చేస్తరు. ఎన్నిసార్లు పైసలు వేసినా కేసీఆర్‌కే పేరు వస్తున్నది మనకు వస్తలేదని క్యాబినెట్లో కూడా కాంగ్రెస్ నేతలు చర్చించారు. పెట్టి లాభం లేదని తీసేయాలని డిసైడ్ అయ్యారు. రేవంత్‌రెడ్డి సర్కారు అత్త కోడళ్ల మధ్య చిచ్చు పెట్టింది. కోడలుకు రూ.2,500, అత్తకు పింఛన్ 4000 రావడం లేదు. అన్ని వర్గాలు ప్రజలు మోసపోయారు. రేవంత్‌రెడ్డి చేతిలో మోసపోని వర్గం లేదు’ అని విమర్శించారు.
‘రాహుల్‌గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా. మోదీతో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా. చంద్రబాబు చేస్తున్న జలదోపిడీ విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు నటించుడు పెద్ద డ్రామా. నీ మ్యానిఫెస్టో ఒక పెద్ద డ్రామా. డిక్లరేషన్ ఇంకా పెద్ద డ్రామా. అన్నింటికీ మించి కాంగ్రెస్‌లో ఉంటవని నమ్మించుడే అతిపెద్ద డ్రామా. ఈ మనిషి తీరును చూసినాక ఎట్ల నమ్ముతున్నరో నాకైతే అర్ధమైతలే. ఎప్పటికప్పుడు మాటలు మారస్తరు. నేను మోదీ స్కూల్లో చదివిన. చంద్రబాబు కాలేజీకి వెళ్లిన, ఇప్పుడు రాహుల్‌గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్న.. అంటరు. రేపు ఇంకెటైనా వెళ్తానని చెప్తున్నట్టేగా! ఎటు సందుదొరికితే అటు వెళ్తానని అంటున్నట్టేగా!! ఒక సిద్ధాంతం లేదు. ఒక నిబద్ధత లేదు. అందుకే అన్ని వర్గాల ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనయ్’ అని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో పదేండ్లు పూర్తిగా ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టాం. ఇకపై అలా కాకుండా ప్రభుత్వంతోపాటు పార్టీకి కూడా సమయం కేటాయిస్తాం.
-కేటీఆర్
రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇచ్చారా? అని కేటీఆర్ నిలదీశారు. అందుకే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్‌కు సంవత్సరీకం చేశారని విమర్శించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వర్‌రెడ్డి కోసం మీరు కష్టపడ్డరు. ఇప్పుడు మీ కోసం ఆయన కాలికి బలపం కట్టుకొని అన్ని మండలాల్లో తిరుగతరు. మహేశ్వర్‌రెడ్డితోపాటు సబితక్క, మేమంతా మీకు అండగా నిలబడుతాం. పార్టీ నుంచి పూర్తి సహకారం అందిస్తాం. కాంగ్రెసోళ్లు 42 శాతం రిజర్వేషన్ అని మోసం చేశారు. మనం అంత మెరుగ్గా బడుగు బలహీనవర్గాలకు అవకాశం కల్పించుకుందాం. రాష్ట్ర నేతలు కూడా స్థానిక నేతలను గెలిపించాలి. మీరు గట్టిగా తలుచుకుంటే, అన్ని వర్గాలను కలిస్తే వారు కసిగా ఉన్నారు కాబట్టి గెలుస్తారు. పదేండ్లు ప్రభుత్వంపై దృష్టి పెట్టి పార్టీని కొంత నిర్లక్ష్యం చేశాం. ఇకపై అలా చేయబోం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారం, పదిరోజులకోసారి పార్టీ నిర్మాణం, బలోపేతంపై దృష్టిపెడతాం. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటది. రెండు పార్టీలకు మూడుచెరువుల నీళ్లు తాగించి మళ్లీ గెలిచి కేసీఆర్‌గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. రాష్ర్టాన్ని కాపాడుకుందాం’ అని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మంతుల్రు సబిత, సత్యవతి, కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, కొప్పుల అనిల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు, విజితారెడ్డి, మహిపాల్, మల్లేశ్, సురేందర్, రామిరెడ్డి పాల్గొన్నారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలో, ఎలా నాయకత్వం వహించాలో, ఎంత అద్భుతంగా పనిచేయవచ్చో దేశానికి చూపెట్టింది కేసీఆర్. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో, ఎలాంటి మాటలు మాట్లాడకూడదో, ఎలాంటి పనులు చేయవద్దో చూపెడుతున్నది రేవంత్‌రెడ్డి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ, ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట మార్చుతున్నానని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ రోజు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తామని చెప్పలేదు కదా? అని ప్రశ్నించారు. ‘బీసీ సబ్‌ప్లాన్ తెస్తా, రూపాయి ఖర్చు పెడితే అందులో 42 శాతం బీసీలకు వెళ్లేటట్టు చట్టబద్ధత తీసుకొస్తా అని రేవంత్‌రెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్ ఢిల్లీ చేతిలో ఉన్నదనుకుందాం. మరి రేవంత్‌రెడ్డి చేతిలో ఉన్న బీసీ సబ్‌ప్లాన్ ఏమైంది. సంవత్సరానికి బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది. రెండు బడ్జెట్ కలిపి కూడా రూ.20 వేల కోట్లు పెట్టలే. మరి ఐదేండ్లలో బీసీలకు రూ. లక్ష కోట్ల బడ్జెట్ పెడతానన్నది ఏమైంది? రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ ఎక్కడైనా కల్పించారా? ఇవన్నీ రేవంత్ చేతిలో ఉన్నాయి. అసెంబ్లీ పెట్టి బీసీ సబ్‌ప్లాన్ పాస్ చేయవచ్చు. చేతిలో ఉన్నవి ఏవీ ఇవ్వలేని రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి రిజర్వేషన్లు సాధిస్తానని చెప్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డికి కేసీఆర్ ఫోబియా ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. ‘ఢిల్లీలోనూ కేసీఆర్‌నే తలస్తున్నాడు. కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా రేవంత్ ప్రసంగం ఉండదు. ఢిల్లీ అయినా, అసెంబ్లీ అయినా, ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ పేరు కలువరిస్తున్నరు. నిద్రలో కూడా కలువరిస్తున్నరేమో. అంత ఫోబియా ఎందుకు? ముఖ్యమంత్రి కావాలనుకున్నవ్. అబద్ధాలు చెప్పినవ్.. 420 అడ్డగోలు హామీలు ఇచ్చినవ్. ప్రజలు నమ్మారు. ఓట్లు వేశారు. అవకాశం ఇచ్చారు. పనిచెయ్. ఎందుకు ఈ డ్రామాలు? బీసీలను మోసం చేస్తున్నవ్ రేవంత్‌రెడ్డీ.. ఎందుకు ఇన్ని డ్రామాలు అని నేనే ప్రశ్నించిన. ఇందుకు నీది డ్రామా, నీ పేరే డ్రామా.. అని ఢిల్లీలో నన్ను తిడుతున్నరు. ఎవరిది డ్రామా’ అని కేటీఆర్మండిపడ్డారు.
పరిగి నియోజకవర్గ అభివృద్ధికి మహేశ్వర్‌రెడ్డి అహర్నిశలు పనిచేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మహేశ్వర్‌రెడ్డి ఓడిపోతారని ఊహించలేదని తెలిపారు. ‘ఏదైనా ప్రఖ్యాత కంపెనీ నా తెలంగాణలో ఉండాలని నాడు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా కేటీఆర్ తాపత్రయపడ్డారు. ఒక కంపెనీ గుజరాత్‌కు వెళ్లిపోతుందని తెలుసుకున్న కేటీఆర్.. ఆ కంపెనీ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేలా చూడాలని అధికారులను పురమాయించారు. కారులో షాద్‌నగర్ నుంచి తుక్కుగూడకు వెళ్లే వరకు అధికారులకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. మేము పక్కన ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయారు. అలా రాష్ర్టాభివృద్ధి కోసం పనిచేసినందునే పార్టీకి సమయం ఇవ్వలేకపోయారు’ అని గుర్తుచేశారు.
తెలంగాణను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టిన కేటీఆర్ యువతకు స్ఫూర్తి అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. హరీశ్వర్‌రెడ్డి కుటుంబంతో మీ అందరికీ మంచి అనుబంధం ఉన్నదని పేర్కొన్నారు. ఆయన వారసుడు మహేశ్వర్‌రెడ్డి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటారని తెలిపారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, ఇది ఉండదమ్మ రాజ్యం అని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే తాము ఓడిపోయి బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని భయంతోనే ఎన్నికలను ఆలస్యం చేస్తున్నదని పరిగి మాజీ ఎమ్మెలే మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.