Telangana | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : ‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏటా పదుల సంఖ్యలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పనిభారంతో కొందరు.. ఆర్థిక ఇబ్బందులతో ఇంకొందరు.. ఉన్నతాధికారుల వేధింపులతో మరికొందరు. కనీసం చనిపోయినవారి కుటుంబాలనూ పరామర్శించలేకపోతున్నాం’ అని పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల నాగోల్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న దీపిక, వరంగల్ జిల్లాలో పని చేస్తున్న నీలిమ వివిధ కారణాలతో తనువు చాలించారు.
పోలీసు అధికారుల సంఘానికి ఎన్నికలు లేకపోవడం, ఇప్పటికే నాయకులుగా ఉన్నవారు పోలీసుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోవడంతో నిత్యం సమస్యల మధ్యే సహవాసం చేస్తున్నామని వారు వాపోతున్నారు. కిందిస్థాయిలో పోలీసులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారధులు లేక ఆత్మనూన్యతకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోతున్నారు. పోలీసు సంఘాలకు ఎన్నికలకు నిర్వహించాలని సాక్షాత్తూ హైకోర్టు చెప్పినా.. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో తమ సమస్యలను పైస్థాయికి తీసుకెళ్లేవారే లేరని పేర్కొంటున్నారు.
ఇటీవల ఇండియా జస్టిస్ రిపోర్టులో తెలంగాణ పోలీసు దేశంలోనే ప్రథమస్థానం సాధించడం వెనుక కిందిస్థాయి పోలీసుల విశేష కృషి ఉన్నదని పేర్కొంటున్నారు. పెరిగిన పని గంటలు, పని ఒత్తిడికి తోడు అనేక సమస్యలతో సతమతమవుతూ ఎవరికీ చెప్పుకోవలో తెలియక తెలంగాణలో పోలీసు సిబ్బంది ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని చెబుతున్నారు. ఈ ఒత్తిడితోనే 13 నెల్లలో 20 మంది పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని చెబుతున్నారు. పోలీసు అధికారుల సంఘానికి 2013లో ఎన్నికలు జరిగాయని, మూడేండ్ల తర్వాత మళ్లీ జరగాల్సి ఉండగా.. నిర్వహించలేదని చెబుతున్నారు. 2016, 2025లో పోలీసు అధికారుల సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేస్తున్నారు.
పోలీసు అధికారుల సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం వెనుక ఏదో దురుద్దేశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. హైకోర్టు అడిగినప్పుడల్లా.. తెలంగాణ పోలీసు అధికారుల సంఘం బైలాస్ ప్రభుత్వం వద్దే ఉన్నాయని, అవి రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని 2016, 2025లో హైకోర్టుకు సమాధానం ఇచ్చిందని చెప్తున్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న పోలీసు అధికారుల సంఘం బైలాస్ కోసం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిని అనేక పర్యాయాలు కలిశామని, స్పందించిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఆ బైలాస్‌ను జీఏడీలోని సర్వీసెస్ ముఖ్య కార్యదర్శికి అప్రూవ్ కోసం పంపించినట్టు చెబుతున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అన్ని గుర్తింపు సంఘాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నా.. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం తమకు ఎన్నికలు నిర్వహించడం లేదని, దీని వెనుక కుట్ర దాగి ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.