BC Commission | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీసీ కమిషన్ గడువును పొడిగిస్తారా? లేక కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నదానిపై బీసీ సంఘాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది. కొత్త కమిషన్ ఏర్పాటు కంటే పాత కమిషన్ గడువు పొడిగింపుతోనే ఎక్కువ ప్రయోజనముంటుందని, స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కమిషన్ ఏర్పాటు వల్ల ఎన్నికలు మరింత జాప్యం కావచ్చని, తద్వారా ఇప్పటికే గాడితప్పిన పంచాయతీల్లో పాలన మరింత దిగజారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం కొత్త కమిషన్‌ను నియమించేందుకే మొగ్గుచూపుతున్నదని, ఆ కమిషన్ చైర్మన్‌గా విశ్రాంత జడ్జిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నదని వినికిడి.
సుప్రీంకోర్టు జారీ చేసిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలను అనుసరించి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు 2021లో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నేతృత్వంలో ఉపేందర్, శుభప్రద్‌పటేల్, కిశోర్‌గౌడ్ సభ్యులుగా డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ర్టాల్లో పర్యటించి, అక్కడి బీసీ కమిషన్లతో చర్చించింది. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు ఆయా రాష్ర్టాల్లో అనుసరించిన విధివిధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలో అనుసరించాల్సిన విధివిధానాలపై కసరత్తు ప్రారంభించింది. బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను క్రోడీకరిస్తూ నిర్ధిష్ట నమూనాను, బీసీల డాటా సేకరణకు కావాల్సిన ప్రశ్నావళిని సిద్ధంచేసే పనిలో నిమగ్నమైంది.
ఇదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వం మారి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కులగణన చేపట్టి, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో బీసీ కమిషన్ డైలామాలో పడిపోయింది. కులగణన ద్వారా రిజర్వేషన్లను స్థిరీకరించాలా? లేక ఓటర్ జాబితా ప్రకారం చేయాలా? అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయకపోవడమే ఇందుకు కారణం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన టీవోఆర్కు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు కూడా రేవంత్ సర్కారు సహకరించకపోవడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీ కమిషన్ ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఈ కమిషన్ గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ మధ్యలోనే నిలిచిపోయింది.
ప్రస్తుత కమిషన్‌ను కొనసాగిస్తేనే రిజర్వేషన్ల స్థిరీకరణ త్వరగా పూర్తవుతుందని బీసీ సంఘా లు అభిప్రాయపడుతున్నాయి. అన్నివిధాలా లాభదాయకమని స్పష్టం చేస్తున్నాయి. కాదని కొత్త కమిషన్‌ను నియమిస్తే రిజర్వేషన్ల స్థిరీకరణతోపాటు స్థానిక ఎన్నికలు తీవ్ర జాప్యమవుతాయని పేర్కొంటున్నాయి. ఒకవేళ కులగణన నిర్వహించినా కూడా దానికి కమిషన్ ఆమోదం త ప్పనిసరి. అప్పుడే రిజర్వేషన్లకు సాధికారత లభిస్తుంది. లేదంటే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు చెల్లుబాటు కావని, కమిషన్ గడువును పొడగించి పని పూర్తిచేసుకోవడం సముచితంగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.
వకుళాభరణం కమిషన్ గడువు ముగియగానే కాంగ్రెస్‌కు చెందినవారితో కొత్తగా బీసీ కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. చైర్మన్‌గా విశ్రాంత జడ్జిని నియమించాలని యోచిస్తున్నట్టు లీకులు వస్తున్నా యి. కొత్త కమిషన్‌లో చైర్మన్ పదవి కోసం ఓ బీసీ సంఘానికి చెందిన కీలక నేత ఇప్పటికే కాంగ్రెస్‌లోని బీసీ నేతలు, ఢిల్లీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్టు జోరుగా వినిపిస్తున్నది. దీన్నిబట్టే ప్రభుత్వం కొత్త బీసీ కమిషన్‌ను నియమించాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతున్నది.