Nitin Gadkari | పెండింగ్ భూసేకరణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ వంతెన పనులు సరిగా జరుగడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతమయ్యేలా కాంట్రాక్టర్‌ను మార్చినట్లు చెప్పారు. పది నెలల్లోనే వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫార్మా సిటీ, ఫార్మారంగం పెద్దదేనని.. హైదరాబాద్‌కు అన్ని ప్రధాన నగరాలు అనుసంధించేలా హైవేలు అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇండోర్-హైదరాబాద్ కారిడార్ పనులు పూర్తి చేశామని, హైదరాబాద్ రీజనల్ రింగ్‌రోడ్ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేను ఆరు వరుసలుగా మారుస్తామన్నారు. హైదరాబాద్ రింగ్‌రోడ్‌పై డబుల్ డెక్కర్ ఎయిర్‌బస్ తీసుకురావాలన్నారు. సీఎన్జీ, ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. సాగులోనూ పర్యావరణహిత వాహనాలే వాడాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ నగరాలతో పాటు స్మార్ట్ గ్రామాలు కావాలని చెప్పారు.