Musi Development | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : మూసీ నది అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, హైదరాబాద్ మెట్రో రైలు అంశాలపై జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్లో ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు బుధవారం ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ ఇండ్లను కేటాయించారో తెలియజేస్తారు. ముందుగా రివర్ బెడ్లో ఆక్రమణలో ఉన్న 1600 ఇండ్లను తొలగించి అక్కడివారిని తరలిస్తారు. మూసీ బఫర్ జోన్లో నిర్మాణాలకు పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చుతో పాటు, పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా ఇస్తారు. డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కేటాయిస్తారు. మూసీ నిర్వాసితులకు చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని సీఎం ఇదివరకే ప్రకటించారు.
ఉదయం కేటీఆర్ డిమాండ్.. సాయంత్రంలోగా సర్కార్ స్పందన
‘పేదలే దిక్కులేక నాలాలపై ఇండ్లు కట్టుకుంటరు.. మానవత్వం ఉన్న ప్రభుత్వమైతే తొలుత వారికి నోటీసులివ్వాలి.. లేదంటే వారికి వేరేచోట ఇండ్లు ఇవ్వాలి.. మేము కట్టిన 40 వేల డబుల్ బెడ్రూం ఇండ్లున్నయి. వాటిని పేదలకు ఇవ్వాలి’ అని మంగళవారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడంతో పాటు పలు సూచనలు చేశారు. సాయంత్రం వరకు మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
ఆక్రమణల వివరాలివ్వండి : సీఎం
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలను గుర్తించి, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించాలని, ఆక్రమణల వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురి కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి పూర్తిస్థాయి నివేదిక రూపొందించాలని చెప్పారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగవతం చేయాలని, మెట్రో మార్గాల్లో భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే పరిషరించాలని సూచించారు. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మెట్రో విస్తరణ అంశాలను వివరించారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్ పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధంచేసి కేంద్రానికి సమర్పించాలని స్పష్టంచేశారు. సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.