తొర్రూరు, ఫిబ్రవరి 7 : గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటిని విస్మరించినందున మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుమారు రెండు వేల బైక్‌లతో పాలకేంద్రం నుంచి అంబేద్కర్ విగ్రహం వర కు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ పేరు ఎత్తే అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన దొంగ రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సీనియర్ నాయకులను పకనబెట్టి బ్రోకర్ రాజకీయాలతో సీఎం పదవి కొట్టేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, మళ్లీ కేసీఆర్ నాయకత్వం అవసరమని ప్రజలు భావిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.