మూలిగే నకపై తాటిపండు పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. అసలే డీఏపీ, యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో కేంద్రం పొటాష్ ధరను అమాంతం పెంచింది. గతేడాది ధరతో పోలిస్తే ఒక్కో బస్తాపై ఏకంగా రూ.350 పెరగ్గా.. కంపెనీలను బట్టి ఒక్కో బస్తా రూ.2100 నుంచి రూ.2150 వరకు ఉండనున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలో రైతులపై రూ.40 కోట్లకు పైగా భారం పడనున్నది.
హుజూరాబాద్, ఆగస్టు 18 : అసలే వ్యవసాయంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతున్నది. ఒకవేళ దిగుబడి తగ్గితే పెట్టుబడి కూడా మీద పడే పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలో కేంద్రం వైఖరి రైతులకు గుదిబండగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా పొటాష్ ధర పెంపునకు పచ్చజెండా ఊపింది. ఏడేళ్ల కింద రూ.670 ఉన్న పొటాష్ బస్తా ధర గతేడాది రూ.1800కు చేరింది. ఇప్పుడు ఏడాదిలో ఏకంగా మరో రూ.350 పెంచడంతో రూ.2150కు చేరింది. సాగు ఆధారాలను బట్టి చూస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులపై రూ.40 కోట్లకు పైగా భారం పడనున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలో 3.06 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉండగా, అందులో లక్షా 15 వేల 200 ఎకరాల్లో వరి, 65 వేల 900 ఎకరాల్లో పత్తి, 24 వేల 144 ఎకరాల్లో మక, మిగతా భూమిలో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఈ లెక్కన పంట మొత్తంలోఎకరానికి ఒక పొటాష్ బస్తా ఉపయోగించాల్చి ఉంటుంది. దీన్ని బట్టి ఒక్క ఈ జిల్లాలోనే రైతులపై రూ.10.71 కోట్ల అదనపు భారం పడనున్నది.
వ్యవసాయంలో పొటాష్ అవసరం తప్పనిసరి. పత్తి కాయ దశలో, వరి చిరు పొట్ట దశలో, మక గింజలు పాలు పోసుకునే స్థితితో పాటు ఇతర పంటల్లోనూ వినియోగించాల్సి ఉంటుంది. కొందరు దుక్కిలోనూ ఉపయోగిస్తారు. అయితే పంట, గింజలు బలంగా ఉండాలంటే కచ్చితంగా పొటాష్ వాడాల్సి ఉంటుంది. కాగా, మరోవైపు పొటాష్ పాత స్టాకు సరఫరా వారం రోజులు కింద నిలిచిపోయింది. నిల్వలు ఏమీ లేవని డీలర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెంచిన ధరతో పాటాష్ బస్తాలు కొనుగోలు చేయాలంటే రైతులకు గుదిబండగా మారనుంది. అయితే, కేంద్రం ధరలు పెంచినా.. పంటలకు మద్దతు ధర పెంచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే కానాకష్టంగా వ్యవసాయం నడిపిస్తున్నం. ఈ పరిస్థితుల్లో పొటాష్ ధరను పెంచడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కంపెనీలు పునరాలోచించాలి. వ్యవసాయంలో దినదినం పెట్టుబడి విపరీతంగా పెరుగుతున్నది. కూలీ రేట్లు నాలుగేండ్లలోనే రెండింతలైనయి. ఇప్పుడు పొటాష్ ధర పెంచి మరింత భారం మోపిన్రు. ఒక్క బస్తాకు రూ.350 పెంచడం చాలా దారుణం.