హనుమకొండ, ఆగస్టు 18: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పో షించిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ కుటిలనీతికి నిదర్శనమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. సర్కార్ పెద్ది విగ్రహాన్ని కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఇది తుగ్లక్, ఉన్మాద చర్యగా పేర్కొన్నారు. విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్ట్‌లతో ఉద్యమాలను అణచివేయలేరని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు వింటేనే ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తిరిగి అదే ప్రాంతంలో పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.
సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతికహక్కు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి లేదని సి రికొండ అన్నారు. సామాజిక న్యాయం గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడటం రాజకీయ జీవితంలోనే అతిపెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర జనాభాలో 56శాతం ఉన్న బీసీలకు కాంగ్రెస్ ప్రభు త్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రెండున్నరేండ్లు పూర్తయినా కనీసం రూ.50 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేసి ఉం డాలన్నారు. ఇప్పటివరకు బీసీలకు ఎన్ని నిధు లు కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో ప్రభు త్వం ప్రజలకు వెల్లడించాలని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.